సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చించడానికి శాసనసభ సమావేశాలని నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటాయి. కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా అధికార తెరాస పార్టీ నేతలే ప్రతిపక్షాలని సవాలు చేస్తుంటారు. ఈనెల 16నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తరువాతమంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలకి సవాలు విసిరారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టులని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలని శాసనసభ కడిగిపడేస్తాం సిద్దంగా ఉండండని హెచ్చరించారు. తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కూడా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకి అటువంటి సవాలే విసిరారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ “మీరు బయట మాట్లాడుతున్న ప్రజా సమస్యల గురించి శాసనసభలో మాట్లాడేందుకు పూర్తి సమాచారంతో రండి. ఈ రెండున్నరేళ్ళలో రాష్ట్రానికి మేమేమి చేశామో, పదేళ్ళలో మీరేమీ చేశారో లెక్కలు తేల్చుకొందాం. ఉత్తం కుమార్ రెడ్డి గారు, భట్టి విక్రమార్కగారు..మీరిద్దరూ మీ ప్రభుత్వం హయంలో కనీసం మీ నియోజక వర్గాలకైన ఏమైనా మేలు చేయగలిగారా? తెలంగాణా ఉద్యమాలలో మీరేం చేశారో చెప్పగలరా? మీ హయంలో మీరేమి చేయకపోయినా రాష్ట్రాభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుంటే, అడుగడుగునా మాకు అడ్డు పడుతూ ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీ కుట్రలన్నీ శాసనసభలోనే బయటపెడతాము. మీరు కూడా ప్రజా సమస్యలపై నిర్దిష్టమైన ఆధారాలతో శాసనసభకి వచ్చినట్లయితే వాటిపై చర్చించడానికి మేము సిద్దంగా ఉన్నాము,” అని సవాలు విసిరారు.
అధికార పార్టీ ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం సర్వసాధారణమైన విషయమే కానీ శాసనసభలో ప్రతిపక్షాలని ఎదుర్కోవడానికి మేము సిద్దం..మీరు సిద్దమేనా? అని ప్రశ్నించేంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం మెచ్చుకోవలసిన విషయమే. ఎన్నికల సమయంలో విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, సాధారణ పరిస్థితులలో కూడా రాష్ట్ర ప్రజల ఆదరణ కలిగి ఉండటం మరొక ఎత్తు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే తెరాస నమ్మకమే దాని ఆత్మవిశ్వాసానికి కారణమని చెప్పవచ్చు.