జయలలిత,ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వంటివారు రాజకీయాలలో పురుషులకి మహిళలు ఏమాత్రం తీసిపోరని నిరూపించి చూపిస్తే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ వంటివారు తమ చిత్రవిచిత్రమైన వ్యవహార శైలితో మహిళల శక్తి సామర్ధ్యాలు, తెలివితేటలపై అనుమానాలు కలిగిస్తున్నారని చెప్పకతప్పదు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టోల్ గేట్ల వద్ద ఆర్మీ సైనికులని మొహరించినందుకు నిరసనగా, మమతా బెనర్జీ ఒక రోజంతా సచివాలయంలో తన చాంబర్ లో తలుపులు మూసుకొని కూర్చోవడం చూసి అందరూ నవ్వుకొన్నారు. అది చూసి ఆమె బయటకి రాక తప్పలేదు.
ఈ ఏడాది జనవరిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి చనిపోయిన తరువాత ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భాజపా మద్దతు పలుకుతున్నప్పటికీ ఆమె కూడా చాలా రోజుల పాటు చిత్రవిచిత్రంగా మాట్లాదిన ఆమె చివరికి మళ్ళీ అదే భాజపా మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అది చూసి ప్రజలు నవ్వుకొన్నారు.
ఆమె మళ్ళీ ఇప్పుడు అటువంటి సీన్ ఒకటి క్రియేట్ చేసి చూపించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకి ఉన్నట్లుగానే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా బలమైన పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ ఆమె కాశ్మీర్ కి ప్రత్యేకంగా కాశ్మీర్ పోలీస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని అనుకొన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భాజపా ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అందుకు నిరసనగా ఆమె సమావేశం మద్యలో నుంచి వాక్ అవుట్ చేసి వెళ్ళిపోయారు. నిజానికి అటువంటప్పుడే ఆమె తన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి అందరినీ తన నిర్ణయన్ని అంగీకరించేలాగ చేయగలిగితే ఆమెకి మంచి పేరు వచ్చేది. ప్రభుత్వానికి కూడా చాల హుందాగా ఉండేది. కానీ ఆమె ఆగ్రహంతో సమావేశం మద్యలో నుంచి లేచి వెళ్ళిపోయినప్పటికీ తన నిసహ్హాయతని బయటపెట్టుకొన్నట్లయింది.
సుమారు మూడు నెలల పాటు ఏకధాటిగా కాశ్మీర్ లో అల్లర్లు సాగినప్పుడే ఆమె వాటిని నియంత్రించలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వంలో తన నిర్ణయాన్ని కూడా అమలుచేసుకోలేకపోతున్నారు. అందుకు ఆమె తనని తానే నిందించుకోవలసి ఉంటుంది. రాజ్యాంగానికి అతీతంగా ప్రభుత్వ పాలన సాగిద్దామనుకోవడం వలననే ఇటువంటి సమస్యలు ఎదురవుతుంటాయని చెప్పక తప్పదు. చట్టపరిధిలో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా దానిని ఎవరూ కాదనలేరు. కాదన్నా ఆమె వారి అభ్యంతరాలని పట్టించుకోకుండా ముందుకు సాగవచ్చు. కానీ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తూ అభాసుపాలవుతున్నారు.