మన్మోహన్ సింగ్ అభిప్రాయం కూడా అదేనా?

December 10, 2016


img

మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఆర్దికమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి గొప్ప పేరు సంపాదించుకొన్నారు. పీవీ తరువాత ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు ఆయన భారత ఆర్ధిక వ్యవస్థని ఇంకా బలోపేతం చేయగల అనేక సంస్కరణలని అమలుచేస్తారని అందరూ ఆశించారు కానీ ఆయనని పేరుకి ప్రధానమంత్రిని చేసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీయే పరిపాలించి దేశాన్ని అన్ని రంగాలలో పూర్తిగా భ్రష్టు పట్టించి చేతులు దులుపుకొన్నారు. ఆయన చాలా గొప్ప ఆర్ధికవేత్త అయినప్పటికీ ఆమె కారణంగానే అసమర్ధుడనే అప్రదిష్ట చెడ్డపేరు పొందారు. 

కనీసం ఇప్పటికైనా ఆయన సోనియా గాంధీ ప్రభావం నుంచి బయటపడినట్లు లేరు. నేటికీ ఆమె పట్ల అదే వినయవిధేయతలు ప్రదర్శిస్తూ, తన పార్టీ విధానాలకి అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ అమలుచేస్తున్న సంస్కరణలని విమర్శిస్తుండటం చాలా విచారకరం. తను పదేళ్ళలో చేయలేని అనేక సంస్కరణలని ప్రధాని నరేంద్ర మోడీ కేవలం రెండున్నరేళ్ళలోనే అమలు చేసి చూపిస్తున్నప్పుడు, ఒక ఆర్దికవేత్తగా డా.మన్మోహన్ సింగ్ పార్టీలకి అతీతంగా ఆయనకి మార్గదర్శనం చేసి ఉండి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ ఆయన కూడా కాంగ్రెస్ విధానానికి అనుగుణంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన వంటి మేధావి కూడా తన పార్టీ సంకుచిత ధోరణికి అనుకూలంగానే మాట్లాడుతుండటం చాలా విచారకరం. 

రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు వలన నిజాయితీ పరుడైన సామాన్య పౌరుడు చాలా నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుని అమలు చేయడంలో బయటపడుతున్న లోపాలని నల్లకుభేరులు చాలా తెలివిగా ఉపయోగించుకొంటూ తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్ గా మార్చేసుకొంటుంటే సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని అన్నారు. అసలు వ్యవస్థలో ఉన్న నగదు అంతా నల్లధనమే అని కేంద్రప్రభుత్వం భావించడం వలననే ఈ విపరీత నిర్ణయం తీసుకొందని, దాని విపరీత పరిణామాలకి దేశంలో సామాన్య ప్రజలు మూల్యం చెల్లించవలసి వస్తోందని అన్నారు. కనీసం ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం యుద్దప్రాతిపదికన నష్టనివారణ చర్యలు చేపట్టి దేశంలో మళ్ళీ సామాన్య పరిస్థితులు తీసుకురావాలని  డా.మన్మోహన్ సింగ్ కోరారు. 


Related Post