తమిళనాట అప్పుడే వేడెక్కుతున్న రాజకీయాలు

December 09, 2016


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు జరిగి ఇంకా మూడు రోజులు పూర్తవలేదు కానీ అప్పుడే అక్కడ రాజకీయాలు మొదలైపోయాయి. వాస్తవానికి అక్కడి రాజకీయ నాయకులు కనీసం ఒకటి రెండు నెలలైనా ఆగుతారని అందరూ భావించారు కానీ మూడో రోజు నుంచే రాష్ట్ర రాజకీయాలు క్రమంగా వేడెక్కడం మొదలైపోయాయి. వాటిలో మొదటగా చెప్పుకోవలసింది జయలలిత స్నేహితురాలు శశికళ గురించే. 

ఇంతవరకు జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్ భవనంలో ఆమె తిష్ట వేశారు. అంతే కాదు..జయ ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని రాధాకృష్ణ నగర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకొంటున్నట్లు తాజా సమాచారం. అంటే జయలలిత రాజకీయ వారసురాలు తానేనని చెప్పకనే చెప్పినట్లయింది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమె వద్దకే వెళ్ళి ఆమెతో మంతనాలు సాగిస్తుండటం మరో విశేషం. అంటే ఆమె ఆధిపత్యాన్ని లేదా నాయకత్వాన్ని వారు అంగీకరిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. వారు అందుకు సిద్దపడినట్లయితే, అన్నాడిఎంకె పార్టీకి ఆమె అధ్యక్షురాలు కావచ్చు. కానీ అప్పుడు ఆమె పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రి కొనసాగనిస్తారా? కొనసాగించినా ప్రభుత్వంపై ఆమె పెత్తనం చేయకుండా ఉంటారా? చేస్తే సెల్వం వర్గం భారిస్తుందా? అనే అనుమానాలున్నాయి.   

ఇక జయలలిత మేనకోడలు దీపా జయరామ్, అన్నాడిఎంకె నుంచి బహిష్కరించబడిన ఎంపి శశికళ, ప్రముఖ నటి గౌతమి మొదలైన వారు జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన అత్తయ్య జయలలిత మృతికి సంబందించి చాలా అంతరంగిక రహస్యాలు తనకి తెలుసునని, వాటిని త్వరలోనే బయట పెడతానని దీపా జయరామ్ మొన్ననే చెప్పారు. నటి గౌతమి మరో అడుగు ముందుకు వేసి జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించాలని ప్రధాని నరేంద్ర మోడీని తన బ్లాగ్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని ఇక ఆమె ఇంటికి వెళ్ళిపోవచ్చని అపోలో వైద్యులు చెప్పిన మరునాడే ఆమె హటాత్తుగా చనిపోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జయలలితని ఎవరూ కలవనీయకూడదు, ఆమె ఎవరినీ కలవకూడదు అనే నిర్ణయాలని ఎవరు తీసుకొన్నారు? అని ఆమె ప్రశ్నించారు. కనుక అపోలో ఆసుపత్రిలో మూడు నెలలుగా ఆమెకి జరిగిన చికిత్సపై తక్షణం దర్యాప్తుకి ఆదేశించాలని ఆమె కోరారు. 


Related Post