నిన్న అద్వానీ..నేడు ప్రణబ్ ముఖర్జీ

December 08, 2016


img

నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు నుంచి నేటి వరకు కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రతిపక్షాలు చాల రభస చేస్తూ సభా కార్యక్రమాలని స్తంభింపజేస్తున్నాయి. కానీ వాటిని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కానీ, రాజ్యసభ చైర్మన్ కురియన్ గానీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు గానీ కేంద్రప్రభుత్వం గానీ నియంత్రించలేకపోతోంది. 

లోక్ సభ సీనియర్ సభ్యుడు లాల్ కృష్ణ అద్వానీ సభ జరుగుతున్న తీరు చూసి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. “సభా కార్యక్రమాలని అడ్డుకొంటున్న ప్రతిపక్ష ఎంపిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, వారి జీతాలలో కోత విధించాలని, ఒకవేళ వారిని నియంత్రించి ఉభయ సభలని నడుపలేమని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే పార్లమెంటుని నిరవదిక వాయిదా వేస్తే మంచిది,” అని సూచించారు. కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రతిపక్షాలు కూడా మళ్ళీ యధాప్రకారం ఉభయ సభలని నేడు కూడా స్తంభింపజేశాయి. 

ఈసారి ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీయే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిల్లీలో జరిగిన డిఫెన్స్ ఎస్టేట్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రస్తుతం పార్లమెంటులో ఎంపిలు వ్యవహరిస్తున్న తీరు పార్లమెంటరీ విధానాలలో ఆమోదయోగ్యం కాదు. ఎంపిలని ప్రజలు పార్లమెంటుకి పంపించింది ఈవిధంగా రభస చేయడానికి కాదు. తమకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకొంటారని! ఒక ఏడాదిలో కొన్ని రోజులు లేదా వారాలు మాత్రమే పార్లమెంటులో చర్చలు జరుగుతాయా? ఇదేమి పద్దతి? సభ్యులకి సభలో చర్చించే హక్కు ఉంటుంది కానీ సభాకార్యక్రమాలని అడ్డుకొనే హక్కు ఉండదు. వారు దేశం కోసం పనిచేయాలి కానీ దేశం కోసం చేస్తున్న పనులకి అడ్డం పడకూడదు. ఒకవేళ వారికి ధర్నాలు వగైరాలు చేసుకోవాలనుకొంటే బయట ఎక్కడైనా చేసుకోవాలి తప్ప పార్లమెంటు లోపల కాదు. పార్లమెంటు ఆమోదం లేనిదే ఒక్క చట్టం కూడా అమలుకాలేదు. పార్లమెంటు ఆమోదం లేనిదే పన్ను విదించలేము. ఖజానా నుంచి ఒక్క పైసా తీసి ఖర్చు చేయలేము. ఏడాదికి రూ.16-18 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాము. కానీ ఈ పద్దతులని మార్చకపోతే, మన పార్లమెంటరీ వ్యవస్థ సమర్ధంగా పనిచేయగలదని నేను భావించడం లేదు,” అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 

ఇన్ని దశాబ్దాల రాజకీయ జీవితంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏనాడు ఇంత ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. పార్లమెంటు సమావేశాలు అంటే ఒకరినొకరు విమర్శించుకోవడం, ఏదో ఒక సాకుతో సభని స్తంభింపజేయడం, అరుపులు కేకలు అనే అభిప్రాయం మన ఎంపిలు కలిగిస్తున్నారు. చివరికి రాష్ట్ర శాసనసభలు కూడా అదేవిధంగా సాగుతున్నాయి. చట్టసభల నిర్వహణ ప్రభుత్వానికి, ప్రజలకి పెద్ద గుదిబండగా మారిపోతోంది తప్ప వాటి వలన ప్రజలకి దేశానికీ ఏమి ప్రయోజనం కలుగడం లేదు. రాన్రాను చట్టసభలలో పరిస్థితులు ఇంకా దిగజారిపోతున్నా అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ప్రతిపక్షాల అల్లరిని భరించవలసి వస్తోంది. అటువంటి వారిని ఇక ఏ మాత్రం ఉపేక్షించనవసరం లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా సూచిస్తున్నట్లే భావించవచ్చు.     



Related Post