నోట్ల రద్దుపై నేడు కూడా పార్లమెంటు ఉభయసభలలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనున్నాయి. ఈ విషయంపై రాహుల్ గాంధీ పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ, “ప్రధానమంత్రి తను సృష్టించిన ఈ సమస్యలని పరిష్కరించలేక వాటి నుంచి తప్పించుకోవడానికి రోజుకొక మాట్లాడుతున్నారు. మొదట నల్లధనం వెలికి తీయడానికే నోట్లని రద్దు చేశామన్నారు. కానీ నెలరోజులు గడిచినా నల్లధనం వెలికి తీయలేకపోయారు. ఆ తరువాత ఉగ్రవాదులని కట్టడి చేయడానికే రద్దు చేశామని చెప్పారు. కానీ చనిపోయిన ఉగ్రవాదుల వద్ద కొత్త నోట్లు దొరుకుతున్నాయి. అంటే ఆయన నిర్ణయం వలన ఆ ప్రయోజనం కూడా నెరవేరలేదని అర్ధం అవుతోంది. నోట్ల రద్దు ఒక అనాలోచిత, తెలివితక్కువ నిర్ణయం. దాని వలన ఆయన చెప్పిన ఏ ఒక్క ప్రయోజనం నెరవేరలేదు కానీ దేశంలో సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. కనుక అయన పార్లమెంటుకి, దేశప్రజలకి ఆయన క్షమాపణలు చెప్పుకొని, తన నిర్ణయం ఉపసంహరించుకోవాలి. పార్లమెంటుకి వచ్చి మేము అడుగుతున్న ప్రశ్నలకి ఆయన సమాధానాలు చెప్పి తీరాలి,” అని రాహుల్ గాంధీ అన్నారు.
నెలరోజులైన పరిస్థితులలో పెద్దగా మార్పు రాకపోవడంతో ఇప్పుడు రాహుల్ గాంధీ మొదలు గల్లీ నేతల వరకు అందరూ ప్రధాని నరేంద్ర మోడీని వేలెత్తి చూపించి విమర్శించగలుగుతున్నారు. ఆయన బహిరంగ సభలలో చాలా అద్భుతంగా తన వాదనని వినిపించి ప్రజలని ఆకట్టుకొంటుంటారు. కానీ పార్లమెంటుకి వచ్చి దాని గురించి తాము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని ప్రతిపక్షపార్టీల సభ్యులు ఎంతగా డిమాండ్ చేస్తున్నా ఆయన స్పందించడం లేదు. ఆయన ఏ కారణంతో, ఏ ఉద్దేశ్యంతో మౌనం వహిస్తున్నా అది ప్రతిపక్షాలకి బలమైన ఆయుధంగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది . కొంతమంది ప్రముఖుల కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారని కనుక దాని వలన వారు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని, పేదలు నేటికీ అష్టకష్టాలు పడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలకి ఆయన ధీటుగా సమాధానం చెప్పకపోవడం వలన దేశ ప్రజలలో కూడా అనుమానాలు, అపోహలు పెరిగేందుకు దోహదపడుతోంది. కనుక ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులోనే సమగ్రంగా మాట్లాడటం చాలా మంచిది. అవసరం కూడా.