ఈ ఏడాది మార్చిలో మహారాష్ట్రాకి చెందిన కులభూషణ్ యాదవ్ అనే ఒక వ్యక్తిని భారత్ గూడచారి అని ఆరోపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లో అరెస్ట్ చేసింది. కొన్ని రోజుల తరువాత అతని చేత ‘అవును నేను భారత గూడచారినే’ అని మీడియాకి చెప్పించింది. కానీ ఇంతవరకు అతను గూడచారి అని నిరూపించుకోలేక, ఆ విషయం బయటపెట్టిన పాక్ మీడియాపై చిందులు వేస్తోంది.
ఒకవేళ అతను నిజంగా భారత గూడచారి అయినా కూడా భారత్ లో పాక్ చేస్తున్న దురాగాతాలతో పోలిస్తే అదేమీ పెద్ద విషయం కాబోదు. సాక్షాత్ డిల్లీలోని పాక్ హైకమీషన్ ఉద్యోగే గూడచర్యం చేస్తూ పట్టుబడిన సంగతి గురించి పాక్ మాట్లాడకపోవచ్చు. అలాగే కాశ్మీర్ లో వేర్పాటువాదులని..వారి ద్వారా కాశ్మీర్ లో అల్లర్లని ప్రోత్సహిస్తున సంగతి దానికి తప్పుగా కనిపించదు. అలాగే భారత ఆర్మీ క్యాంపులపై, పఠాన్ కోట్ వైమానిక స్థావరాలపై పాక్ ఉగ్రవాదుల దాడులు దానికి తప్పుగా కనిపించవు కానీ కులభూషణ్ యాదవ్ గూడచారి అని నిరూపించలేకపోతున్న విషయం పాక్ మీడియా వ్రాస్తే అది చూసి ఉలిక్కిపడి వాటిపై రంకెలు వేస్తోంది.
పాక్ తీరు ఎన్నటికీ మారదని భారత్ తో సహా ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు దాని చేతిలో ఉన్న వందలాది అణుబాంబులని చూసే అందరూ వెనక్కి తగ్గవలసి వస్తోందని చెప్పవచ్చు. డోనాల్డ్ ట్రంప్ అయినా పాకిస్తాన్ని దారిలో పెడతాడేమో అనుకొంటే ఆయన కూడా ‘అదొక అద్భుతమైన దేశమని, నవాజ్ షరీఫ్ గొప్ప తెలివైనవాడని’ పాక్ భజన మొదలుపెట్టేసి తను కూడా ద్వందవైఖరే అవలంభించబోతున్నట్లు స్పష్టం చేసేశారు. ఈ మద్యనే అమెరికన్ కాంగ్రెస్ పాకిస్తాన్ కి ఏటా చెల్లించే కప్పం విడుదలకి ఆమోదముద్ర వేసేసింది. దానితోబాటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవచ్చు అనే చిన్న మెసేజ్ కూడా పెట్టేసి తన పని అయిపోయినట్లు చేతులు దులుపుకొంది. దానికి అమెరికా అందిస్తున్న ఈ బారీ ఆర్ధిక సహాయం భారత్ పాలిట శాపంగా మారిందని చెప్పక తప్పదు. అందుకే పాకిస్తాన్ క్యాన్సర్ లేదా ఎయిడ్స్ వంటి ఎన్నటికీ నయం కాని వ్యాధిలాగ భారత్ కి తయారయింది. దానికి ‘శస్త్ర చికిత్స’ కూడా సాధ్యం కాదనే చెప్పక తప్పదు. కనుక ఎంత నొప్పిగా ఉన్నా దానిని భారత్ భరిస్తుండవలసిందే!