ప్రధాని నరేంద్ర మోడీ పాత పెద్ద నోట్లని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి నేటికి నెలరోజులయింది కానీ ఇంకా దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజలు నోట్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నెలరోజులలో జరిగిన కొన్ని పరిణామాలని చూసినట్లయితే, కేంద్రప్రభుత్వం ఈ సమస్యలని వాయిదా వేసే ప్రయత్నాలే చేస్తోంది తప్ప వాటిని పరిష్కరించలేక పోతోందని అర్ధం అవుతోంది.
నేటికీ దేశంలో చాల రాష్ట్రాలలో రూ.500 నోట్లు ప్రజల చేతికి అందనే లేదు. దానికి మరో రెండు మూడు వారాలు పట్టవచ్చని కేంద్ర ఆర్ధిక శాఖ చావు కబురు చల్లగా చెప్పినట్లు నిన్న చెప్పింది. పోనీ బ్యాంకులు, ఎటిఎంలలో ప్రజలకి కావలసిన డబ్బు ఇవ్వగలుగుతున్నారా అంటే అదీ లేదు. నేటికీ అనేక ఎటిఎంలు రోజుల తరబడి మూతబడి ఉన్నాయి. ఈ నోట్ల రద్దు, నోట్ల కొరత కారణంగా సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగులు బ్యాంకులలో జమా అయిన తమ జీతాలు తీసుకోలేక, ఇంటి అద్దె, పాలవాడికి, కూరల వాడికి డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ కారణంగా వారు కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజూ ఉద్యోగానికి బయటకి వెళ్ళే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బస్సు ఎక్కాలన్నా, బండిలో పెట్రోల్ పోయించుకావాలన్నా, చివరికి హోటల్లో తిఫిని తినాలన్నా చేతిలో డబ్బు ఉండదు. చేతిలో ఉన్న డబ్బుని బట్టే రోజువారి కార్యక్రమాలు చేసుకోవలసి వస్తోంది.
ఒకవైపు సామాన్య ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే మరో పక్క మంత్రులు, బడాబడా పారిశ్రామిక వేత్తలు బ్యాంకుల నుంచి ఏకంగా లక్షలు, కోట్లు కొత్త నోట్లు పట్టుకుపోతున్నారని రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. బడాబాబులు, బ్రోకర్ల దగ్గర లక్షలు విలువ చేసే కొత్త నోట్లు పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి వారిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని స్పష్టం అవుతోంది.
నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే వరకు దానిని రహస్యంగా ఉంచడం చాలా అవసరమే కానీ ఆ తరువాతయినా కేంద్రప్రభుత్వం ఇటువంటి సమస్యలన్నిటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి టాస్క్ కమిటీలని నియమించాలనే ఆలోచన ఎందుకు కలుగలేదో అర్ధం కాదు. ఒక సమస్య కళ్ళకి కట్టినట్లు కనబడిన తరువాత అప్పుడు దానిపై కేంద్ర ఆర్ధిక శాఖో లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో ఒక నిర్ణయం ప్రకటించి చేతులు దులుపుకొంటున్నాయి తప్ప యుద్ద ప్రాతిపదికన ఈ సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తున్నట్లు కనబడటం లేదు.
ఈ నోట్ల కొరత కారణంగా టోల్ గేట్స్ వద్ద ట్రాఫిక్ జామ్ అయితే ‘సరే మళ్ళీ డిశంబర్ 15వరకు పాత నోట్లు తీసుకొంటాము’ అని ప్రకటించడంతో ఆ సమస్యని వాయిదా వేసుకుపోతోంది తప్ప దానికి శాశ్విత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు లేదు.
నోట్ల రద్దు చేసే ముందు మార్కెట్ల నుంచి ఉపసంహరించుకొంటున్న నగదుని మళ్ళీ భర్తీ చేయడానికి కేంద్రప్రభుత్వం మొదట రూ.500 నోట్లని ముద్రించకుండా రూ.2,000 నోట్లని ముద్రించడమే పెద్ద పొరపాటు. ఆ తరువాతైన ఆ తప్పుని సరిదిద్దుకొనే ప్రయత్నం చేయకపోవడం మరో పెద్ద పొరపాటు. ప్రజలు ఇదివరకు ఉల్లిపాయలో మరొక వస్తువో దొరకడం లేదని చెప్పుకొనేవారు కానీ ఇప్పుడు వాటిని కొనేందుకు నోట్లు దొరకడం లేదని చెప్పుకోవలసి వస్తోంది! ప్రజల బ్యాంక్ ఖాతాలలో డబ్బు ఉన్నా దానిని తీసుకోలేని విచిత్రమైన పరిస్థితి మొట్ట మొదటిసారిగా ఏర్పడింది. ఇంకా ఎంత కాలం ఈ నోట్ల కష్టాలు కొనసాగుతాయో ఏమో? కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎప్పటికి మేలుకొంటాయో ఏమో?