అవును సామాన్య ప్రజలు కేవలం రూ.2,000 కోసం బ్యాంకులు, ఎటిఎంల వద్ద రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతుంటే, బడాబాబులు బ్యాంకుల వెనుక ద్వారం నుంచి లక్షలు, కోట్లు తరలించుకొనిపోతున్నారు. కనుకనే వారు క్యూ లైన్లలో కనబడటం లేదు. వారి వలననే నెల రోజులవుతున్నా నేటికీ సామాన్య ప్రజలకి తమ బ్యాంక్ ఖాతాలలో నుంచి రూ.2,000 తీసుకోవడం కూడా పెద్ద కష్టంగా మారిపోయింది.
అక్రమార్కులలో కెల్లా విక్రమార్కుడు ఎవరంటే గాలి జనార్ధన రెడ్డి అని చెప్పక తప్పదు. నోట్ల రద్దు తరువాత కూడా అతను అత్యంత వైభవంగా తన కుమార్తె వివాహం బెంగళూరులో చేయడం అందరూ చూశారు. సామాన్య ప్రజలకి రూ. రూ.2,000 దొరకక నానా కష్టాలు పడుతుంటే, అతను అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్ళి ఎలా చేయగలిగారు? అని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అడగలేదు. దేనికంటే అతనికున్న పరపతి రాజకీయ సంబంధాలే కారణం అని చెప్పక తప్పదు. ఈరోజు గాలి జనార్ధన రెడ్డి తాజా అవినీతి బాగోతం మరొకటి బయటపడింది. అది అతని సంస్థలో చేస్తున్న ఒక రమేష్ గౌడ అనే డ్రైవర్ ఆత్మహత్యకి ముందు వ్రాసిన సూసైడ్ నోట్ లో బయటపడింది.
దానిలో అతను ఏమి వ్రాశాడంటే గాలి జనార్ధన రెడ్డి గత మూడు వారాలలో ఏకంగా రూ.100 కోట్లు విలువగల పాత నోట్లని మార్చుకొన్నాడని వ్రాశాడు. భీమ్ నాయక్ అనే స్థానిక రెవెన్యూ అధికారితో సహా అనేక మంది బ్యాంకర్లు గాలికి సహాయపడుతున్నారని సూసైడ్ నోట్ లో వ్రాశాడు. గాలితో సహా కర్ణాటకలో అనేకమంది మంత్రులు, బడాబాబులు కోట్ల రూపాయలు మార్చుకొంటున్నారని తెలిపాడు. పాత నోట్ల మార్పిడి కోసం వారు 20 శాతం కమీషన్ ఇస్తున్నారని, ఆ మార్పిడిలో రూ.8 లక్షలు తేడా రావడంతో గాలి అనుచరులు తనని వేధించారని, ఆ వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకొంటున్నట్లు రమేష్ గౌడ సూసైడ్ నోట్ లో స్పష్టంగా వ్రాశాడు.
దీనిని బట్టి మన దేశంలో ఏ స్థాయిలో నోట్ల మార్పిడి జరుగుతోందో ఊహించవచ్చు. ఒకవ్యక్తి ఏకంగా వంద కోట్లు మార్చుకొన్నప్పటికీ అతనిపై కానీ, సదరు బ్యాంకులపై గానీ ఎవరికీ అనుమానం రాలేదంటే నమ్మశక్యంగా ఉందా? ఒకవైపు గాలి జనార్ధన రెడ్డి వంటివారు వెనుక ద్వారం నుంచి వందల కోట్లు దర్జాగా తరలించుకొని పోతుంటే, సామాన్య ప్రజలు కేవలం రూ.2,000 కోసం బ్యాంకులు, ఎటిఎంల ముందు రోజుల తరబడి పడిగాపులు కాయవలసివస్తోంది. ఈ స్థాయిలో దేశంలో నల్లధనం వైట్ గా మారిపోతుంటే వారిని ఎవరూ పట్టుకోలేనప్పుడు, లేదా పట్టుకోదలచనప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఏమి లాభం? ఎవరిని ఉద్దరించడానికి?