దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళపై భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె చేతిలో అన్నాడిఎంకె పార్టీని పెట్టినట్లయితే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్ సెల్వం ఇక స్వేచ్చగా పనిచేయలేరని అన్నారు. ఆయనకి పార్టీలో గట్టి పునాది, పార్టీపై గట్టి పట్టు లేనందున ఆమె పార్టీని తన అధీనంలోకి తీసుకొని, తన కుటుంబ సభ్యులని ఎవరినైనా పార్టీ అధ్యక్ష పదవిలో నియమించే అవకాశం లేకపోలేదని, అదే జరిగితే ఆ పార్టీ నిలువునా చీలిపోవడం ఖాయం అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు.
సుబ్రహ్మణ్య స్వామి వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం నిజమనే చెప్పవచ్చు. జయలలిత ఇదివరకు జైలుకి వెళ్ళినప్పుడు, పన్నీర్ సెల్వం తనకి వీరవిధేయుడని ఆమె గట్టిగా నమ్మినందునే ఆయననికి ముఖ్యమంత్రిని చేశారు. ఆసుపత్రి పాలైనప్పుడు కూడా అదేకారణం చేతనే ఆయనకి మళ్ళీ ఆ పదవి కట్టబెట్టారు. కానీ దానర్ధం ఆయనకి పార్టీపై, ప్రభుత్వంపై పూర్తి పట్టు కలిగి ఉన్నారని కాదు. జయలలిత మొన్న మృతి చెందిన తరువాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేపట్టడానికి పార్టీలో శశికళ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ఆ సమయంలో విభేదాలు బయటపెట్టుకొన్నట్లయితే, తమని భాజపా చీల్చి అధికారం దక్కించుకొంటుందనే భయంతోనే అందరూ పన్నీర్ సెల్వంకి మద్దతు పలికారు. కానీ అంత మాత్రాన్న శశికళ పార్టీపై, ప్రభుత్వంపై తన పెత్తనం వదులుకొంటారని అనుకోవడం కూడా అవివేకమే అవుతుంది. కనుక ఆమె కూడా త్వరలోనే పావులు కదపడం మొదలుపెట్టవచ్చు.
అప్పుడు ఆమెని పన్నీర్ సెల్వం నిలువరించగలరా లేదా? ఒకవేళ నిలువరించలేకపోతే ఆయన భాజపా సహాయం కోరుతారా? లేకపోతే పార్టీపై పట్టు సాధించడానికి శశికళే భాజపా మద్దతు కోరుతారా? ఒకవేళ వారిద్దరూ రాజీపడినట్లయితే అప్పుడు భాజపా ఏమి చేయబోతోంది? అనే ప్రశ్నలకి ఒకటి రెండు నెలలోనే సమాధానాలు వారే స్వయంగా బయటపెట్టవచ్చు.