దేశంలో అందరూ నోట్ల రద్దు, దాని తదనంతర పరిణామాల గురించే తెగ చర్చించేసుకొంటున్నారు కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం దానిని మరో కోణంలో నుంచి చూసి ఎవరూ ఊహించని విషయం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొంటున్న ఈ నిర్ణయాలన్నీ దేశంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించడానికే కావచ్చని జగన్ జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది దేశంలో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రప్రభుత్వం దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తోంది కనుక వాటితో బాటే మధ్యంతర ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని జగన్ జోస్యం చెప్పారు. బహుశః అందుకే ఆయన పెద్ద నోట్లని రద్దు చేసి ఉండవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు.
కనుక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని జగన్ తన పార్టీ నేతలకి, శ్రేణులకి పిలుపునిచ్చారు. క్రిందటిసారి ఎన్నికలలో చేసిన కొన్ని పొరపాట్ల వలన త్రుటిలో విజయం చేజార్చుకొన్నామని, ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితులలో తెదేపాని ఓడించి అధికారంలోకి రావాలని అందుకు ఇప్పటి నుంచే అందరూ సిద్దం కావాలని జగన్ కోరారు.
జగన్ గతంలో తెదేపా ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని తరచూ జోస్యం చెప్పేవారు కానీ దానికి బలమైన, హేతుబద్దమైన కారణాలు చెప్పలేకపోయేవారు. తెదేపా అవినీతి పాలన పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోయిందని, అందుకే ప్రభుత్వం కూలిపోతుందని అసంబద్దమైన కారణాలు చెప్పేవారు. కానీ ఈసారి ఆయన చెపుతున్నఈ జోస్యం మాత్రం వాస్తవానికి దగ్గరగానే ఉందని చెప్పవచ్చు. మరి ప్రధాని నరేంద్ర మోడీ నిజంగానే మధ్యంతర ఎన్నికలకి వెళ్ళే ఉద్దేశ్యంతోనే ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటున్నారా? ఒకవేళ మోడీ మధ్యంతర ఎన్నికలకి వెళ్ళాలనుకొంటే అందుకు వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు అంగీకరిస్తాయా? అనే సందేహాలున్నాయి.