రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించాలని నిశ్చయించుకొని, వాటికి రకరకాల పేర్లతో మొబైల్ యాప్స్ ప్రకటించేస్తున్నాయి. అలాగే హడావుడిగా పోస్ మెషిన్లు, స్వైపింగ్ మెషిన్లు వగైరా ఏర్పాటు చేసేస్తున్నాయి.
నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడం చాలా మంచి విషయమే. దేశంలో పావు వంతు మంది ప్రజలు నగదు రహిత లావాదేవీలు నిర్వహించినా దాని వలన దేశానికి చాలా మేలు కలుగుతుంది. ముఖ్యంగా మన వ్యాపార, వ్యవస్థలు పూర్తి పారదర్శకంగా మారుతాయి. దాని వలన మన ఆర్ధిక వ్యవస్థ చాలా బలపడుతుంది.
ఇది నాణేనికి ఒకవైపు అనుకొంటే రెండో వైపున మరొక విధంగా కనబడుతుంది. మన దేశంలో 50 శాతం మంది పైగా ప్రజలు నేటికీ నిరక్షరాస్యత, పేదరికం, దారిద్ర్యంతో బాధలు పడుతున్నారని గణాంకాలే చెపుతున్నాయి. అంటే సుమారు 60 కోట్లు మందికి ఈ విధానం వలన కొత్త ఇబ్బందులే తప్ప ఎటువంటి ప్రయోజనమూ ఉండదని స్పష్టం అవుతోంది. ఇక ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నవారిలో కూడా చాలా మంది అనేక కారణాల చేత, అనేక లావాదేవీలలో నగదు చెల్లింపులకే ఎక్కువ మొగ్గు చూపడం అందరికీ తెలిసిందే.
ఇక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మొబైల్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించమని ప్రజలని కోరుతోంది. రకరకాల పేర్లతో పధకాలు ప్రవేశపెట్టేసి మొబైల్ ఫోన్స్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించమని ప్రజలని కోరుతున్నాయి. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ నుంచి లావాదేవీలు పెరగాలంటే, అందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం చాలా అవసరం. ఇప్పుడు దేశంలో చాలా మంది దగ్గర ఆధునిక ఫీచర్స్ కలిగిన మొబైల్ ఫోన్స్ ఉన్న మాట వాస్తవమే. కానీ వాటి ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి వాటిలో తగినంత భద్రత ఉందా? అని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే, ఈ రోజుల్లో కంప్యూటర్స్ కంటే మొబైల్ ఫోన్లని హ్యాక్ చేయడమే చాలా సులువుగా మారిపోయింది. ప్రజలు ఏదైనా ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలనుకొంటే, అందుకోసం తమ కాంటాక్స్, ఫోన్ వివరాలు, ఇంకా అనేక ముఖ్యమైన సమాచారం కావాలని అడుగుతుంటాయి. చాలా మంది ఆ యాప్స్ పొందడం కోసం ఆ వివరాలని సేకరించడానికి అనాలోచితంగా ‘ఓటుకి నోటు కేసు’ బటన్ నొక్కేసి సదరు సంస్థకి అనుమతి ఇచ్చేస్తుంటారు. ఆ సంస్థ ఆ వివరాలతో ఏమైనా చేయగలదు. ఈ నేపద్యంలో మొబైల్ ఫోన్ ద్వారా లావాదేవీలు నిర్వహించడం ఎంత క్షేమం? ఒకవేళ క్షేమం కాదనుకొంటే దాని కోసమా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నాయో చెప్పడం లేదు.
అదే విధంగా నిరక్ష్యరాస్యులు, నిరుపేదలు డెబిట్ కార్డులు లేదా మొబైల్ ఫోన్స్ ద్వారా ఏవిధంగా తమ రోజువారి లావాదేవీలు నిర్వహించగలరో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం లేదు. దేశంలో నేటికీ రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు. ఒక ఆటోరిక్షా నడిపే వ్యక్తి లేదా రోడ్డు పక్కన చేపలో, కూరగాయలో అమ్ముకొనే వ్యక్తి లేదా రోజువారి కూలీలు ఏ విధంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చెప్పవలసి ఉంది. లేకుంటే వారికి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపదలచుకొన్నారో చెప్పవలసి ఉంది.
సుమారు 125 కోట్ల మంది జనాభా, అందులో సగం మంది నిరక్షరాస్యులు లేదా నిరుపేదలు ఉన్న భారతదేశంలో ఇటువంటి విప్లవాత్మక విధానాలని, సంస్కరణలని ప్రవేశపెట్టడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, కాలపరిమితి పెట్టుకొని అమలు చేయాలే తప్ప ముందుచూపు లేకుండా ‘నగదు రహిత లావాదేవీలు ప్రవేశపెట్టేశాం ఇక మీ ఖర్మ’ అంటే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిది. అసలు క్షేత్ర స్థాయిలో సామాన్య ప్రజలు దీని గురించి ఏమనుకొంటున్నారో ప్రభుత్వాలు ముందుగా తెలుసుకొనే ప్రయత్నం చేస్తే దానిని బట్టి ఈ విషయంలో ఏవిధంగా ముందుకు వెళ్ళాలో అర్ధం అవుతుంది.