భాజపా దోస్త్ ఎవరు? సెల్వం, శశి, స్టాలిన్?

December 06, 2016


img

సాధారణంగా ఒక కుటుంబ యజమాని చనిపోయిన తరువాత అతని ఆస్తుల పంపకాల ప్రస్తావన వస్తుంటుంది. అలాగే రాజకీయ నాయకులు చనిపోతే వారి వారసత్వం ప్రస్తావన వస్తుంటుంది. జయలలిత విషయంలోని అదే జరిగింది. ఆమె రాజకీయ వారసురాలు ఎవరనే ప్రశ్నకి ఇద్దరి పేర్లు వినిపించాయి. 1.ఆమె స్నేహితురాలు శశికళ. 2. జయలలిత వీర విధేయుడు ఓ.పన్నీర్ సెల్వం. 

వారిలో పన్నీర్ సెల్వం ఇప్పటికే ముఖ్యమంత్రి స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కనుక ఆయన వేగంగా పావులు కదిపి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. కనుక ఇక ఆ పదవి గురించి శశికళ ఆలోచించనవసరం లేదు. కానీ ఇంకా పార్టీ అధ్యక్ష పదవి ఒకటుంది. వారిద్దరిలో దానిని ఎవరు దక్కించుకొంటారో చూడాలి. 

జయలలిత బ్రతికి ఉన్నంత కాలం ఆమె కూడా అందరిపై అధికారం చెలాయించగలిగారు. జయకి భయపడి అప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో ఎవరూ ఆమెకి ఎదురు చెప్పలేదు. కానీ ఇప్పుడు జయలలిత అండలేని ఆమెని పార్టీలో నేతలు, ప్రభుత్వంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఖాతరు చేస్తారా లేదా? ఒకవేళ చేయకపోతే ఆమె జయలలిత లాగ నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి వారినందరినీ తన దారికి తెచ్చుకోగలరా లేదా? అనేది మరికొద్ది రోజులలోనే తేలిపోతుంది. 

అయితే, ఇటువంటి అవకాశమే చాలా కాలంగా ఎదురుచూస్తున్న భాజపా ఈ అవకాశాన్ని వదిలిపెడుతుందనుకోలేము. ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వాళ్ళ చెన్నై వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంని భుజం తట్టి ఓదార్చారు. ఆ తరువాత అక్కడే ఉన్న శశికళ నెత్తిన చెయ్యిపెట్టి నేనున్నానని ధైర్యం చెప్పారు. కనుక వారిద్దరిలో ఎవరు ముందుకు వస్తే వారితో భాజపా చేతులు కలిపి రెండవ వర్గాన్ని చీల్చి చెండాడే ప్రయత్నం చేయవచ్చు. 

పన్నీర్ సెల్వంకి శశికళ వర్గం నుంచే కాకుండా పార్టీలో పళనిస్వామి వంటి పోటీదారుల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉంది. కనుక తప్పనిసరయితే ఆయన భాజపా చేతులు కలుపవచ్చు. అలాగే ఒకవేళ ఆయన శశికళని పూర్తిగా పక్కన పెట్టేస్తే, ఆమె భాజపా మద్దతు కోరవచ్చు. 

కానీ జయలలిత బ్రతికి ఉన్నంత కాలం భాజపాని దూరంగా ఉంచారు కనుక ఇప్పుడు వారిద్దరిలో ఎవరు దానితో చేతులు కలపాలనుకొన్నా వారి ప్రత్యర్ధులు అదే పాయింట్ తో విరుచుకు పడవచ్చు కనుక కొంతకాలం రెండు వర్గాలు కూడా భాజపాకి దూరంగా ఉండవచ్చు. భాజపా కూడా వారి పరిస్థితి అర్ధం చేసుకోగలదు కనుక అది కూడా వారికి కొంత సమయం ఈయవచ్చు. 

ఒకవేళ వారిరువురూ తమతో చేతులు కలిపేందుకు ఇష్టపడనట్లయితే, అప్పుడు దాని ముందు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం కరుణానిధి కుమారుడు స్టాలిన్. ఇద్దరి లక్ష్యం రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతో చేతులు కలిపేందుకు ఆయనకేమీ అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కనుక మరొకటి రెండు నెలల్లో రాష్ట్ర రాజకీయాలలో మెల్లగా కదలికలు మొదలవవచ్చునని భావించవచ్చు.


Related Post