రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలకి ఇద్దరు బలమైన విలన్లు ఉన్నారు. వారే జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. వారిని విలన్లని అధికార పార్టీలు భావిస్తుంటే, తాము హీరోలమని వారు భావిస్తుండటమే విశేషం. వారిద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయి. వాళ్ళిద్దరూ కేవలం ముఖ్యమంత్రులనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుంటారు. ఇద్దరూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న భూసేకరణ కార్యక్రమాలని గట్టిగా వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నారు. ఇద్దరూ చాలా అవేశపరులే. ఇద్దరూ కూడా అధికారంలో ఉన్నవి నిరంకుశ ప్రభుత్వలని, వాటిని తక్షణమే గద్దె దించాలని గట్టిగా కోరుకొంటున్నారు. ఇద్దరిపై కేసులున్నాయి. కేసులు వేరైనా ఇద్దరూ జైలుకి వెళ్ళి వచ్చారు. కాకపోతే జగన్ కాస్త ఎక్కువ రోజులు, రేవంత్ రెడ్డి కొంచెం తక్కువ రోజులు ఉన్నారు అంతే తేడా. మరో విశేషం మళ్ళీ ఇద్దరూ తప్పకుండా జైలుకి వెళతారని తెదేపా, తెరాస నేతలు బల్లగుద్ది గట్టిగా వాదిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో బరంపురం పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములని తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఒక బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ “ దేవుడి దయ ఉంటే మరొక ఏడాదిలోగానే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. లేకుంటే రెండేళ్ళ తరువాత తప్పకుండా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అంతవరకు ప్రజలు ఈ రాక్షస పాలనని భరించక తప్పదు,” అని అన్నారు.
దానిపై తెదేపా మంత్రులు స్పందిస్తూ “దేవుడి దయ ఉంటే ఏడాది లోగానే జగన్ మళ్ళీ జైల్లో ఉంటాడు. నోట్ల రద్దుతో ఆయన మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడు,” అని ఎద్దేవా చేశారు.
ఇక మన రాష్ట్రంలో తెరాస విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి గురించి ఇంచుమించు అదేవిధంగా మాట్లాడటం విశేషం.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మా ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలే తిరగబడి తగిన విధంగా ఆయనకి బుద్ధి చెపుతారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలని కేంద్రప్రభుత్వం ఆంధ్రాలో కలిపేస్తే మాట్లాడని రేవంత్ రెడ్డి, ఇప్పుడు మేము ప్రాజెక్టులు కడుతుంటే వాటి గురించి అబద్దాలు మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఓటుకి నోటు కేసులో ఒకసారి జైలుకి వెళ్ళివచ్చిన అయన తన తీరు మార్చుకోకపోతే, ఈసారి జీవితాంతం జైల్లో చిప్పకూడు తినవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి,” అని రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.