తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సాధారణంగా ప్రజా ప్రతినిధులు భావోద్వేగంతో రాజీనామాలు చేసినప్పుడు వారు పునరాలోచించుకోవడానికి కొంత సమయం ఇస్తాము. కల్వకుంట్ల కవిత విషయంలో కూడా అదే ఆనవాయితీ పాటించాము.
కానీ ఆమె మొన్న మండలి సమావేశానికి హాజరయ్యి తాను బాగా ఆలోచించుకునే రాజీనామా చేశానని చెప్పారు. తన రాజినమాని ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కనుక ఆమోదించాము.
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీకి అవకాశం లేదు. ఉందని భావించి ఏర్పడిన పార్టీలు క్రమంగా మూతపడ్డాయి. కనుక కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టడం దుస్సాహసమనే భావిస్తున్నాను. ఆమె బాగా ఆలోచించుకునే అడుగు ముందుకు వేస్తారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
దేశ, తెలంగాణ రాజకీయాలలో పురుషులదే పైచేయిగా ఉందనే విషయం అందరికీ తెలుసు. గతంలో విజయశాంతి రాజకీయ పార్టీ ప్రయోగం విఫలమైంది.
తెలంగాణలో ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి బీఎస్పీతో రాజకీయాలలో ప్రవేశించిన ఆర్ ప్రవీణ్ కుమార్ రెండున్నరేళ్ళు కష్టపడినా ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చివరికి తాను ఎంతగానో విమర్శించిన కేసీఆర్ పంచన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత దానిని నిలబెట్టి నిర్వహించడానికి సినిమాలు చేయాల్సివస్తోందని చెప్పుకునేవారు.
అదీగాక తెలంగాణలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ మూడు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో వామపక్షాలు చాలా బలంగా ఉన్నాయి. వీటన్నిటినీ కాదని కవిత కొత్త పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో ఆమె చెప్పాలి.