కల్వకుంట్ల కవిత తనని తండ్రి పిలిచి మళ్ళీ పార్టీలో చేర్చుకుంటారని మొదట్లో ఆశపడి ఉండొచ్చు. అందుకే మొదట్లో రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం లేదని పదేపదే చెప్పేవారు. కానీ తనపై బీఆర్ఎస్ పార్టీ నేతల విమర్శలు పెరుగుతుండటంతో తండ్రి నుంచి ఇక పిలుపు రాదని గ్రహించినట్లే ఉన్నారు. అందుకే తండ్రి ఫోటో తొలగించి దాని స్థానంలో తన బొమ్మతో తెలంగాణ జాగృతి కండువాలు వేసుకొని తిరుగుతున్నారు.
ఆమె జనం బాట కార్యక్రమం ముగించుకున్న తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని కొత్త పార్టీ స్థాపిస్తానని చెప్పారు. నిన్న మండలిలో మరోసారి అదే చెప్పారు. తాజా సమాచారం ప్రకారం ఆమె తన కొత్త పార్టీ కోసం మూడు పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
1 తెలంగాణ జాగృతి పార్టీ (టిజేపీ), 2 తెలంగాణ బహుజన జాగృతి సమితి (టీబీజేఎస్), 3 తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి (టీఆర్‌జేఎస్). ఈ మూడింటిలో ఏదో ఓ పేరు ఖరారు చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఫిబ్రవరి నెలాఖరు లేదా తెలుగు నూతన సంవత్సరం ఉగాది (మార్చి 19)న కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తామని కల్వకుంట్ల కవిత ఇదివరకే చెప్పారు.