కవితకు బీఆర్ఎస్‌ సూటి ప్రశ్నలు... సీరియస్ వార్నింగ్

January 06, 2026


img

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిన్న శాసనమండలిలో బీఆర్ఎస్‌ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టి, తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. 

ఆమె విషయంలో ఇంతకాలం సంయమనం పాటిస్తున్న బీఆర్ఎస్‌ పార్టీ తొలిసారిగా అధికారికంగా ఎదురుదాడి చేసింది. ఆ పార్టీ తరపున మహిళా నేతలు గొంగిడి సునీత, తుల ఉమ, సుమిత్ర నంద్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి కవితకు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. 

1. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడలేదని విమర్శించిన మీరు మండలిలో మీ సొంత గోడు మొరపెట్టుకొని మమ్మల్ని విమర్శించారే తప్ప ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు?

2. పార్టీ పేరు మార్పుని వ్యతిరేకించానని చెప్పుకుంటున్న మీరు జాగృతి పేరుని ఎందుకు మార్చుకున్నారు? 

3. ఎంపీగా ఓడిపోయానని మీరు ఏడుస్తుంటే కేసీఆర్‌ దయతలచి మీకంటే చాలా సీనియర్ అయిన వినోద్ కుమార్‌ని కాదని మీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదా? 

4. మీరు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు పాలైతే మీ వలన బీఆర్ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ ప్రతిష్టకు భంగం కలిగింది కదా?

5. అయినప్పటికీ మీరు జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్‌, హరీష్‌ రావు ఢిల్లీ వెళ్ళి మిమ్మల్ని విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు మీకు తెలియవా?

6.  మేము మిమ్మల్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే మీరు బిజేపికి అనుకూలంగా ట్వీట్స్ పెట్టి వెంటనే చెరిపేసిన సంగతి మాకు తెలుసు. 

7. ఈ స్కాంతో కేజ్రీవాల్‌కి అవినీతి మరకలు అంటించి అయన రాజకీయ జీవితం నాశనం అవ్వడానికి కారణం మీరు కాదా?

8. ఈ స్కాంలో మీకు ప్రమేయం లేదని మీ ఇంటి ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిపై, మీ పిల్లలపై ప్రమాణం చేయగలరా?

9. మీరు పార్టీ పెట్టుకొని రాజకీయాలలో రాణించాలనుకుంటే పెట్టుకోండి మాకేమీ అభ్యంతరం లేదు. కానీ అధికారపార్టీ మెప్పు కోసం కేసీఆర్‌ మీద, మా పార్టీ మీద నోటికొచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేస్తామంటే సహించబోము. 

10. కేసీఆర్‌ ఒక్క సైగ చేస్తే చాలు బీఆర్ఎస్‌ కార్యకర్తలు మిమ్మల్ని ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా చేయగలరని తెలుసుకోండి. మా సహనాన్ని అలుసుగా భావించవద్దు, అంటూ తీవ్రంగా హెచ్చరించారు. 


Related Post