రాష్ట్రంలో వైకాపా అనే పార్టీ కూడా ఒకటి ఉందని ప్రజలకి గుర్తు చేయడానికి అప్పుడప్పుడు ఆ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక అంశం మీద మాట్లాడేసి మళ్ళీ వెంటనే మాయం అయిపోతుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8న ప్రకటించినప్పటి నుంచి సుమారు 10 రోజుల పాటు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనబడలేదు. అందుకు ఆయన ఎటువంటి కారణం చెప్పనేలేదు. బయటకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ లో పాల్గొన్నారు. ఆ అంశంపై తమ అధినేత వైఖరి తెలుసుకొన్న తరువాత తెలంగాణా వైకాపా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కూడా దాని గురించి ఇప్పుడు తాపీగా నాలుగు ముక్కలు మాట్లాడటానికి మీడియా ముందుకు వచ్చారు. అంతే గాదు...ఆ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వంద వైఖరి అవలంభించారని ఆయనపై విమర్శలు కూడా చేసి మళ్ళీ మాయం అయిపోయారు.
ఇంతకీ ఈ విషయంలో వైకాపా అభ్యంతరం దేనికంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట నోట్ల రద్దుని వ్యతిరేకించి, డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తరువాత మనసు మార్చుకొని దానిని ఎందుకు సమర్ధిస్తున్నారు? అని. నోట్ల రద్దు వలన సామాన్య ప్రజలు...ముఖ్యంగా దినసరి కూలీ పనులు చేసుకొనేవారు, రైతులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనేవారు చాలా ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ కి వారి బాధలు పట్టవా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే వారి సమస్యల తీర్చడానికి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యని సృష్టించిన కేంద్రప్రభుత్వం, తన వైఫల్యాలని కప్పి పుచ్చుకొనేందుకు ప్రతిపక్షాలని నిందించడం చాలా విడ్డూరంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
నోట్ల రద్దు తరువాత దేశంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. వాటిని తగ్గించడం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు యధాశక్తిన ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ వైకాపాతో సహా ప్రతిపక్షాలన్నీ కలిసి దానిని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ నిర్వహించి ప్రజలని ఇంకా ఇబ్బందులకి గురి చేశాయి. బంద్ నిర్వహించినప్పటికీ అది బంద్ అని చెప్పుకొంటే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందనే భయంతో అది కేవలం నిరసన ప్రదర్శనలు మాత్రమే అని చెప్పుకోవడం ద్వంద వైఖరే.
నోట్ల రద్దుపై తమ వైఖరి ఏమిటో విస్పష్టంగా చెప్పలేకపోతున్నప్పటికీ దానికి నిర్ద్వందంగా మద్దతు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వైకాపా విమర్శించడం సిగ్గు చేటు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం ప్రకటించినప్పుడు దేశంలో కోట్లాది మంది ప్రజలు, రాజకీయ పార్టీలు దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత దాని లాభనష్టాలని చూసి కొందరు సానుకూలంగా, రాజకీయ ప్రయోజనాల కోసం అర్రులు చాస్తున్న ప్రతిపక్షాలు వ్యతిరేకంగా స్పందించడం మొదలుపెట్టాయి. కేసీఆర్ కూడా మొదట దాని పట్ల వ్యతిరేకత ప్రదర్శించినప్పటికీ, దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వాధి నేతగా కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని అంగీకరించి అమలుచేస్తున్నారు. ఈ సమస్యల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నారు. అందుకు ఆయనని అభినందించవలసిందిపోయి, వైకాపా తన ఉనికిని చాటుకోవడానికే విమర్శిస్తోంది.