ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న పాత నోట్లని రద్దు చేసినట్లు ప్రకటించిన తరువాత వారి బినామీ ఆస్తుల లెక్కలు కూడా బయటకి తీస్తానని హెచ్చరించారు. కానీ ఆ మాటని ఎవరూ చెవికెక్కించుకోకుండా హడావుడిగా చాలా బారీగా బంగారం, వజ్రాలు వంటి విలువైన ఆభరణాలు కొనేశారు. ఇప్పుడు దానిని వదిలించుకోవలసిన పరిస్థితి కలిగేలాగుంది. మోడీ ముందుగా చెప్పినట్లుగానే ఆ బంగారు గుట్టలని త్రవ్వడం మొదలుపెట్టారు.
కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ మొన్న పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆదాయపన్ను చట్ట సవరణ బిల్లులో బంగారం నిలువల పరిమితులు, వాటికి మార్గదర్శకాలు కూడా చేర్చారు. ఆ చట్టాన్ని మొన్న లోక్ సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. దానిలో బంగారం గురించి ఏమి నిబంధనలు విదించారంటే, ఆదాయపన్ను చెల్లించిన డబ్బుతో ఎంత బంగారం అయినా కొనుగోలు చేయవచ్చు. అలాగే వారసత్వంగా వచ్చిన బంగారు నగలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే వారసత్వంగా వచ్చిన ఆస్తితో లేదా వ్యవసాయ, ఇతర మార్గాల ద్వారా చట్టబద్దంగా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలపై కూడా ఎటువంటి చర్యలు ఉండవు.
కానీ ఆధాపన్ను శాఖ దాడులలో పురుషులు ఒక్కొకరికీ 100 గ్రాములు, పెళ్ళికాని యువతులకి 250 గ్రాములు, వివాహిత స్త్రీల వద్ద 500 గ్రాముల వరకు బంగారం ఉన్నా ఎటువంటి ప్రశ్నలు ఉండవు. వివాహిత మహిళలు ధరించే నల్లపూసలు, మంగళ సూత్రాల గురించి కూడా ఎటువంటి ప్రశ్నలు ఉండవు.
కానీ లెక్క జూపని డబ్బుతో ఈ పరిమితుల కంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన బంగారానికి పన్నులు, జరిమానాలు తప్పవు. సవరించిన ఆదాయపన్ను చట్టం పార్లమెంటు ఆమోదం పొంది అమలులోకి వచ్చినట్లయితే దాని ప్రకారం, ఆదాయపన్ను శాఖ దాడులలో లెక్క జూపని నల్లధనంలో దాదాపు 85 శాతం వరకు ఊడ్చుకుపోతుంది.
ఆ లెక్కలలోనే బహుశః ఈ అదనపు బంగారం కూడా కలిపి లెక్కించబడుతుంది కనుక అది కూడా ఊడ్చుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆదాయపన్ను చట్టంలో కేంద్రప్రభుత్వం విధించిన బంగారం పరిమితులు, నిబంధనలు దేశంలో సామాన్య ప్రజలు ఎవరికీ నష్టం కలిగించవని అర్ధం అవుతూనే ఉంది. ఒక మధ్యతరగతి కుటుంబంలో గరిష్టంగా కేజీ బంగారం కూడా బెట్టగలిగడం చాలా కష్టమే కానీ ఒకవేళ కూడబెట్టినా అది ఈ పరిధిలోకి రాదు కనుక వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ బంగారు పళ్ళేలు, కంచాలలో భోజనాలు చేసే గాలి జనార్ధన్ రెడ్డి వంటి అవినీతిపరులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులే ‘మోడీ బాధితులుగా’ మారుతారు. కనుక దీనిపై కూడా మళ్ళీ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టవచ్చు.