పవన్ కళ్యాణ్ తెదేపాతో యుద్దానికి సిద్దపడతారా?

December 01, 2016


img

ఈరోజు ఏపి రాజకీయాలలో ఒక ఆసక్తికరమైన చిన్న పరిణామం జరిగింది. ఆ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రావు ఇద్దరూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదా, భూసేకరణ, నోట్ల రద్దు మొదలైన అనేక అంశాలు, ప్రజా సమస్యలపై చర్చించుకొన్నామని తెలిపారు. జనసేనతో తమకి భావసారూప్యత ఉన్నందునే పవన్ కళ్యాణ్ న్ని స్నేహపూర్వకంగా కలిసినట్లు వారు తెలిపారు. మళ్ళీ మరొకసారి పవన్ కళ్యాణ్ తో సమావేశమవుతామని చెప్పారు. పొత్తుల గురించి మాట్లాడటానికి ఇంకా చాలా సమయం ఉందని రామకృష్ణ చెప్పారు. ముందుగా రెండు పార్టీలు కలిసి ప్రజా సమస్యలపై పోరాడే అవకాశాల గురించి మాత్రమే చర్చించినట్లు చెప్పారు. 

పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పెట్టినప్పుడల్లా తెదేపా, భాజపాలకి చురకలు వేస్తూనే ఉన్నారు. భాజపాకి మరికాస్త ఎక్కువగా వేస్తుండటం గమనిస్తే, ఆయన వచ్చే ఎన్నికలలో దానికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవనే అనిపిస్తుంది.  తెదేపా పాలన పట్ల కూడా పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని ఎన్నడూ దాచుకొనే ప్రయత్నం చేయలేదు. తెదేపా, భాజపాలు రెండూ కలిసి సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ భాజపాని వదిలించుకోదలిస్తే, దానితో బాటు తెదేపాని కూడా వదులుకోక తప్పదు. 

ఒకవేళ పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్దపడినట్లయితే, తెదేపాని కూడా వద్దనుకొన్నట్లే భావించవచ్చు. పవన్ కళ్యాణ్ తీరుని నిశితంగా గమనిస్తున్న తెదేపా మానసికంగా అందుకు సిద్దంగానే ఉందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ వామపక్షాల వైపు ఒక అడుగు వేస్తే, తెదేపా, దాని బాకా మీడియా వెంటనే పవన్ కళ్యాణ్ పై యుద్ధం ప్రకటించడం ఖాయం. 


Related Post