నోట్ల రద్దుని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నవారిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరికంటే ముందున్నారు. మమతా బెనర్జీ ఈ అంశంపై చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే మొదట్లో ఆమె అందరినీ ఆకట్టుకోగలిగారు. ఈ వంకతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని, దేశంలో భాజపాయేతర పార్టీలన్నిటినీ ఏకత్రాటిపైకి తీసుకువచ్చి వాటిని తను నాయకత్వం వహించాలని భావించారు. తద్వారా వచ్చే ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీని బలంగా డ్డీకొని ఆ పదవిని చెప్పట్టాలని ఆమె కలలు కని ఉండవచ్చు. కానీ ఆ పోరాటం వెనుక ఆమె ఉద్దేశ్యాలని గ్రహించడంతో ప్రతిపక్షాలు కూడా ఆమెకి దూరంగా జరగడం ప్రారంభించాయి. అది పాట్నాలో కళ్ళకి కట్టినట్లు స్పష్టంగా కనబడింది.
ఆమె పాట్నాలో నోట్ల రద్దు ని వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహిస్తే దానికి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కానీ హాజరుకాలేదు. ఆమె స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా నితీష్ కుమార్ ఆమె సభకి హాజరు కాలేదు. అలాగే వారిరువురూ తమ పార్టీ ప్రతినిధులని కూడా ఆమె సభకి పంపలేదు. వారు ఆమె సభకి మద్దతు తెలుపలేదు. లాలూ మాత్రం తమ ఆర్.జె.డి.తరపున మొక్కుబడిగా ఒకే ఒక్కరిని సభకి పంపారు.
ఇది ఆమె ఊహించని పరిణామమే కనుక ఆమె తీవ్ర నిరాశ చెంది ఉండవచ్చు. కనుక తన వైఫల్యంపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే తను ప్రయాణిస్తున్న విమానంలో తగినంత ఇందనం నింపకుండానే పాట్నా నుంచి బయలుదేరదీసి, దానిని సాంకేతిక కారణాలని సాకుగా చూపించి కోల్ కతాలో ల్యాండింగ్ అవకుండా జాప్యం చేసి తనని హత్య చేయడానికి కుట్ర పన్నారని తృణమూల్ ఎంపిలు సరికొత్త డ్రామా ఆడుతున్నారేమో ? దర్యాప్తులో ఎలాగూ అన్ని విషయాలు బయటపడతాయి.
అయినా విమానంలో తగినంత ఇందనం లేకపోతే పైలట్ విమానాన్ని మళ్ళీ పాట్నాలోనే ల్యాండింగ్ చేసి ఉండవచ్చు కదా? కానీ అలాగ చేయకుండా పాట్నా నుంచి కోల్ కతా వరకు వచ్చింది అంటే దానిలో తగినంత ఇందనం ఉండబట్టే వచ్చిందని అర్ధం అవుతోంది కదా? కోల్ కతా విమానాశ్రయం చేరుకొన్న తరువాత సుమారు అర్ధగంటసేపు విమానం గాలిలో చక్కర్లు కొట్టిందని తృణమూల్ ఎంపిలే చెపుతున్నారు. అంటే దానిలో ఇంకా చాలా ఇంధనం మిగిలి ఉందనే కదా అర్ధం? ఇప్పుడు ప్రజలు ఆమె చేస్తున్న నోట్ల రద్దు పోరాటం గురించి కాకుండా ‘ఆమె హత్యకి జరిగిన ఈ కుట్ర’ గురించే ఎక్కువ మాట్లాడుకొనే అవకాశం ఉంటుంది కనుక తను అత్యుత్సాహంతో, దురాలోచనతో మొదలు పెట్టిన ఈ పోరాటం నుంచి తప్పుకోవడానికి వీలు కల్పించుకోవడానికే తృణమూల్ నేతలు ఈ డ్రామా ఆడిన్నట్లు అనుమానం కలుగుతోంది.