నగదు రహిత దిశలో మరో ముందడుగు

December 01, 2016


img

నోట్ల రద్దుతో దేశంలో ఊహించని అనేక రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తరువాత మొదట షాక్ కి గురైన అన్ని రాష్ట్రాలు మెల్లగా తేరుకొని తదనంతర సమస్యల నుంచి బయటపడటానికి ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. 

ఈ విషయంలో దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే రెండు తెలుగు రాష్ట్రాలు చాలా త్వరగా తేరుకొని, వాటికి శాశ్విత నివారణోపాయాలని అమలుచేయడం మొదలుపెట్టాయి కూడా. అదే...నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడం. 

నిజానికి రెండు రాష్ట్రాలలో పెద్ద నగరాలు, పట్టణాలలో ఇప్పటికే చాలా మంది ఈవిధానంలో లావాదేవీలు జరుపుతున్నారు. ముఖ్యంగా విద్యాధికులు, యువత దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో సామాన్య ప్రజలు కూడా నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పేర్లతో పదకాలని అమలుచేయడం మొదలుపెట్టాయి. 

తెలంగాణాలో నగదు రహిత లావాదేవీల నిర్వహించడానికి పైలట్ ప్రాజెక్టుగా మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గాన్ని ఎంచుకొని అప్పుడే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అలాగే డిశంబర్ 15 నుంచి తెలంగాణా ఆర్టీసి కూడా సిటీ మరియు రూట్ బస్సులలో ఈ విదానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. జంటనగరాలలో సుమారు 95శాతం మందికి డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నందున దీనిని అమలుచేయడం పెద్ద కష్టమేమీ కాదని అధికారులు భావిస్తున్నారు. కానీ ఈ విధానంలో ప్రజలకి చెల్లింపులు చేయడం అలవాటు అయ్యే వరకు నగదుని కూడా స్వీకరించితే మంచిది. ఈ నగదు రహిత టికెట్స్ జారీ చేయడానికి వీలుగా మొదట 2,000 స్వీపింగ్ మెషిన్లని సిద్దం చేసుకొంటున్నారు. 

రాష్ట్ర రవాణాశాఖ కూడా ఈవిషయంలో మిగిలిన శాఖలకంటే చాలా ముందే ఉంది. ఇప్పటికే అది డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు, వాహనాల రిజిస్ట్రేషన్ వంటి 15 రకాల సేవలని నగదు రహితంగా నిర్వహిస్తోంది. మంగళవారం నుంచి మరో 44 రకాల సేవలని కూడా నగదు రహితంగా నిర్వహించడం ప్రారంభించింది. 

ఇక ఆంధ్రాలో కూడా రవాణాశాఖ సోమవారం నుంచి కొన్ని జిల్లాలలో పోస్ మెషిన్ల ద్వారా లావాదేవీలు నిర్వహించడం మొదలుపెట్టింది. గుంటూరు జిల్లాలో గల 362 రేషన్ దుఖాణాలలో నేటి నుంచి ఈ పోస్ మెషిన్ల ద్వారానే లావాదేవీలు మొదలుపెట్టింది. 

గత మూడు వారాలుగా నోట్ల రద్దు వలన కలిగిన విపరీత పరిణామాలని మాత్రమే అందరం చూస్తున్నాము కానీ మెల్లగా దాని సత్ఫలితాలు కూడా చూడగలుగుతున్నాము. ఈ సమస్యలని తట్టుకొని భారతదేశం నిలబడగలిగినట్లయితే, ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా నిలబడటం ఖాయం. 

దేశంలో వామ పక్షాలు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమాద్మీ వంటి పార్టీలు ప్రజలలో భయాందోళనలని కలిగించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరింపజేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలబడి, ఈ సమస్యని అధిగమించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టడం చాలా అభినందనీయం. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరాశావాదం ప్రదర్శిస్తుంటే, కేంద్రప్రభుత్వం, ముఖ్యమంత్రులు చాలా ఆశాభావంతో, సానుకూలదృక్పదంతో వ్యవహరిస్తూ ప్రజలకి ధైర్యం చెపుతుండటం చాలా ప్రశంశనీయం. 


Related Post