జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని దేశ ప్రజలు అందరూ గౌరవించాలి. వారి మనస్సులో నుంచి ఆ కోరిక, దేశభక్తి వ్యక్తం అయినప్పుడు అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అమెరికాతో సహా అనేక చిన్నా పెద్దా దేశాలలో ప్రజలు అందరూ తమ జాతీయ గీతానికి చాలా గౌరవం ఇస్తుంటారు. కానీ ఆధునికత పేరిట పాశ్చాత్య మోజులో పడి కొట్టుకుపోతున్న భారత్ లో ప్రజలు మాత్రం వాటికి అంతగా విలువ ఈయరనే చేదు నిజం అందరికీ తెలిసిందే. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. కానీ సుప్రీంకోర్టు మాత్రం అందరూ విధిగా వాటిని గౌరవించి తీరాలని చెప్పడమే కాకుండా ఇక నుంచి సినిమా హాళ్ళలో సినిమా ప్రదర్శనకి ముందు జాతీయ జెండాతో కూడిన జనగణమన గీతాన్ని ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటి తరం యువతకి తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు ఎటువంటి కోర్టు ఆదేశాలు లేకుండానే అన్ని సినిమా హాళ్ళలో సినిమా ప్రదర్శన ముగిసిన వెంటనే జాతీయ గీతాన్ని ప్రదర్శించేవారు. మొదట్లో అది మొదలవగానే అందరూ లేచి నిలబడి దానితో గొంతు కలిపి పాడేవారు కూడా. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉండేది అంటే ఆ సినిమా కంటే గొప్పగా ఉండేది. కానీ కాలక్రమేణా జాతీయ గీతం మొదలవగానే జనాలు థియేటర్లలో నుంచి బయటకి వెళ్ళిపోతుండటం లేదా కుర్చీలలో నుంచి లేచి నిలబడకపోవడం వంటివి చేస్తుండటంతో మన జాతీయ గీతం గౌరవానికి భంగం కలుగుతోందనే అభిప్రాయంతో సినిమా ధియేటర్లలో దానిని ప్రదర్శించడం మానుకొన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయి. మన జాతీయ జెండా గురించి, జాతీయ గీతం గురించి చులకనగా, విమర్శనాత్మకంగా మాట్లాడటం ఒక గొప్ప విషయంగా మారిపోయింది.
ప్రజలందరి మనసులలో దేశభక్తి ఉప్పొంగుతుంటే సినిమా హాళ్ళలో జాతీయ గీతం ప్రదర్శించవలసిన అవసరమే లేదు. కానీ అది కొరవడినప్పుడు సినిమాహాళ్ళలో జాతీయ గీతం ప్రదర్శిస్తే దాని గౌరవానికి ఇంకా భంగం కలుగుతుందే తప్ప దేశ ప్రజల ఆలోచనలలో మార్పు ఆశించలేము. అయినా కడుపులో లేనిదీ కావలించుకొంటే వస్తుందా? గుర్రాన్ని చెరువు దగ్గరకి తీసుకు వెళ్ళగలము కానీ దాని చేత నీళ్ళు త్రాగించగలమా? అనే నానుడి ఉండనే ఉంది. సుప్రీంకోర్టు ప్రయత్నం కూడా అటువంటిదేనని చెప్పవచ్చు. సినిమా హాల్లో తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ పాటని వేస్తే జనాలు శ్రద్దగా వింటారేమో కానీ జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తే హల్లో ఉంటారని అనుకోలేము. కనుక సుప్రీంకోర్టు తన నిర్ణయంపై పునరాలోచించుకొంటే మంచిది. లేకుంటే నేడో రేపో లౌకికవాదానికి హక్కులు పొందిన వాళ్ళు ఎవరో అదే కోర్టులో దాని నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేయగలరు.