హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణా రాజకీయ జేయేసి ఆధ్వర్యంలో ప్రాజెక్టుల నిర్వాసితులతో బుదవారం ఒక సమావేశం జరిగింది. దానిలో పాల్గొన్న జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నిర్వాసితులతో మాట్లాడుతూ, ఒకప్పుడు తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అందరూ కలిసి ఏవిధంగా పోరాడామో, ఇప్పుడు కూడా అదే విధంగా అందరూ కలిసికట్టుగా పోరాడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రాజెక్టులవారిగా నిర్వాసితుల సమస్యలని ఆయన అడిగి తెలుసుకొన్న తరువాత త్వరలోనే వారి కోసం కార్యాచరణ పధకాన్ని ప్రకటిస్తానని హామీ ఇచ్చారు.
ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ పట్ల ఇప్పుడు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వివిద వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వేర్వేరుగా సదస్సులు సమావేశాలు నిర్వహిస్తూ, ఆ సందర్భంగా తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. అయితే రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి ఇంకా ఎందుకో తటపటాయిస్తున్నట్లు కనబడుతున్నారు. ఒకవేళ ఆయనకి అటువంటి ఉద్దేశ్యం లేనట్లయితే, ఆయన ప్రభుత్వంపై ఈవిధంగా ఎంతకాలం పోరాడినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే తెలంగాణా రాష్ట్ర సాధన సమయంలో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కనుక అప్పటిలాగే ప్రజలందరూ తనతో కలిసి పోరాడాలని ఆశిస్తే అది అత్యాశే అవుతుందని చెప్పక తప్పదు.
కానీ ఆయన చేస్తున్న ఈ పోరాటాల వలన తెరాస పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది కనుక తెరాస ఆయనని తప్పకుండా గట్టిగా ఆయనని ఎదుర్కొనే ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఆయన చేస్తున్న ఈ పోరాటాల వలన తెరాసకి నష్టం కలిగినట్లయితే ఆ ప్రయోజనం కాంగ్రెస్ లేదా మరొక పార్టీకి దక్కవచ్చు. అదే జరిగితే ఆయన పోరాటాల వలన ఆశించిన ప్రయోజనాలు (ప్రజా సమస్యలు తీర్చడం) సాధించలేకపోగా, రాష్ట్ర రాజకీయాలని కెలికినట్లు అవుతుంది. కనుక ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయ పార్టీ స్థాపించుకొని ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం మంచిది లేదా ఏదో ఒక పార్టీలో చేరి తెరాస సర్కార్ పై పోరాటాలు చేసినా మంచిదే. కానీ ఈవిధంగా ఎంత కాలం పోరాటాలు చేసినా ఏమి ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రొఫెసర్ కోదండరామ్ గ్రహిస్తే మంచిది.