ఇదేనా మన దేశభక్తి?

November 30, 2016


img

 దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తాము దేశాన్ని చాలా ప్రేమిస్తున్నామని చాలా గర్వంగా చెప్పుకొంటుంటారు. తమ దేశభక్తిని వాహనాలపై ‘ఐలవ్ ఇండియా’ స్టికర్ల ద్వారానో లేకపోతే క్రికెట్ మ్యాచ్ లలో మువ్వన్నెల పతకాలని రెపరెపలాడించడం ద్వారానో చాటుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ప్రజల దేశభక్తిని శంఖించనవసరం లేదు కానీ ఈ మూడు వారాలలో సామాన్య ప్రజలు మొదలు బడాబడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకుల వరకు చాలా మంది యధాశక్తిన కేంద్రప్రభుత్వాన్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలని చూస్తుంటే ఇదేనా మన దేశభక్తి? అని సందేహం కలుగక మానదు. 

ఈ నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతుండటం ఎంత వాస్తవమో, నల్లదనాన్ని వైట్ గా మార్చడంలో వారు కృషి చేయడం కూడా అంతే నిజం. వారి అవసరాలు, కష్టాలు, వారి చిన్న చిన్న ఆశలే వారి బలహీనతలుగా మారాయి. వాటిని నల్లకుభేరులు చాలా తెలివిగా ఉపయోగించుకొంటూ తమ నల్లధనాన్ని వారి ద్వారానే వైట్ గా మార్చేసుకొంటున్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ సామాన్య ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సాహసోపేతమైన మంచి నిర్ణయాన్ని తీసుకొంటే, ఆ సామాన్య ప్రజలే ఆయన ఆశయాన్ని దెబ్బ తీస్తుండటం చాలా విచారకరం. అందుకు సామాన్య ప్రజలని నిందించడం కంటే, వారి బలహీనతలతో ఆడుకొంటున్న నల్లకుభేరులనే నిందించవలసి ఉంటుంది. దేశంలో వివిధ వర్గాల ప్రజలు ఈవిధంగా వ్యవహరిస్తుంటే, ఇటువంటి క్లిష్ట సమయంలో కేంద్రప్రభుత్వానికి అండగా నిలబడవలసిన ప్రతిపక్షాలు ఈ సమస్యని రాజకీయం చేసి దాని నుంచి రాజకీయ లబ్ది పొందాలని తహతలాడుతుండటం ఇంకా దురదృష్టకరం. ఈ ప్రయత్నంలో కేంద్రప్రభుత్వానికి అవి సహకరించకపోయినా పరువాలేదు కానీ అది విఫలం కావాలని, తద్వారా తాము రాజకీయ లబ్ది పొందాలని కోరుకోవడం చాలా విచారకరం. అందుకే నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అవి పార్లమెంటు లోపలా బయట గట్టిగా పోరాటాలు చేస్తున్నాయి. వాటి తీరు చూస్తుంటే, దేశం ఏమైపోయినా పరువాలేదు మాకు మా ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలే చాలా ముఖ్యం అన్నట్లుంది. 

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఈ విపరీత పరిణామాలని చూసి భయపడి, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఒకవేళ కేంద్రప్రభుత్వం తన నిర్ణయం ఉపసంహరించుకొన్నట్లయితే, అప్పుడు ప్రతిపక్షాలే కాదు యావత్ దేశ ప్రజలు కూడా ఎన్నడూ ఊహించలేని భయంకరమైన పరిస్థితులని ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించడం లేదు. 

దేశంలో సామాన్య ప్రజలతో సహా ప్రతిపక్షాలు కూడా నల్లధనం వెలికి తీయాలనే కోరుకొంటున్నట్లు చెపుతున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీకి సహకరించడానికి ఎవరూ సిద్దపడటం లేదు. దేశంలో వివిధ వర్గాల ప్రజలు, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇదేనా మన దేశభక్తి? ఇంతేనా మన దేశ భక్తి? అని సందేహం కలుగుతోంది. దేశ ప్రజలందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే తమ దేశభక్తిని నిరూపించుకోవలసిన సమయం ఇదేనని గుర్తించడం. అందుకు వారు ఏమీ చేయనక్కరలేదు. నల్లకుభేరులకి సహకరించకుండా ఉంటే అంతే చాలు.  


Related Post