నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో వారి పాలనలోనే రజాకార్లు తెలంగాణ ప్రజలను చాలా దారుణంగా హింసించారు.. ధన,మాన ప్రాణాలను దోచుకున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సుమారు ఏడాది పాటు వారి అకృత్యాలు కొనసాగాయి. అవి మితిమీరడంతో కేంద్ర బలగాలు సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్‌ని చుట్టుముట్టి నవాబుల సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని తెలంగాణ ప్రజలకు విముక్తి ప్రసాదించింది.
సెప్టెంబర్ 17, 1948న ఏం జరిగిందంటే...
నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని భారత్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు.
సెప్టెంబర్ 13న భారత్ సైన్యం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సైనిక చర్యకు సిద్దమైంది.
మహారాష్ట్రలో నిజాం నవాబుల అధీనంలో ఉన్న షోలాపూర్, దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌లను భారత్ దళాలు సెప్టెంబర్ 14న స్వాధీనం చేసుకొని హైదరాబాద్ వైపు కదిలాయి.
షోలాపూర్ నుంచి బయలుదేరిన మరో దళం ముందుగా నల్ దుర్గ్ కోటని స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపు కదిలింది.
విజయవాడ నుంచి మరో దళం బయలుదేరి నిర్మల్, సూర్యాపేట, వరంగల్, ఖమ్మంలను స్వాధీనం చేసుకొని హైదరాబాద్‌వైపు కదిలింది.
మహారాష్ట్రలో లాతూర్, తెలంగాణలోని జహీరాబాద్ వద్ద నిజాం సైనికులకు, భారత్ దళాలకు మద్య చిన్నపాటు యుద్ధం జరిగింది. దానిలో నిజాం సైనికులను చిత్తుచేసి భారత్ దళాలు ముందుకు సాగాయి.
కానీ మళ్ళీ బీబీ నగర్, పటాన్‌చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ వద్ద మళ్ళీ నిజాం సేనలు వారిని అడ్డగించాయి. భారత్ సేనలు వారిని ఓడించడంతో నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ ఓటమిని అంగీకరించి లొంగిపోయారు.
దీంతో భారత్ దళాలు హైదరాబాద్‌ని నలువైపులా ముట్టడిస్తూ సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు నగరంలోకి అడుగుపెట్టాయి.
అప్పటికే తమ ఓటమిని అంగీకరించిన హైదరాబాద్ ప్రధాని లియాఖత్ ఆరోజు ఉదయమే తన పదవికి రాజీనామా చేశారు.
చివరి నిజం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తన మున్షీ సూచన మేరకు తమ డక్కన్ రేడియో స్టేషన్‌కు వెళ్ళి భారత్‌కు లొంగిపోతున్నట్లు ప్రకటించారు.
నిజాం సైన్యాధ్యక్షుడు ఎల్ ఇద్రూస్ భారత్ సైనిక దళాల కమాండర్ జేఎం చౌదరి ఎదుటలొంగిపోగా, నిజాం నవాబు సర్దార్ పటేల్ ముందు లొంగిపోయారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేస్తున్నట్లు సెప్టెంబర్ 17, 1948న ప్రకటించారు.
భారత్ చేపట్టిన ఈ మిలటరీ ఆపరేషన్‌తో ఏం జరుగుతుందోనని ప్రజలు నాలుగు రోజులు తీవ్ర భయాందోళనలతో గడిపారు. కానీ భారత్ దళాలు నిజాం సైన్యాన్ని ఓడించి హైదరాబాద్‌లో ప్రవేశిస్తున్నాయని తెలుసుకొని వేలాదిగా రోడ్లపైకి వచ్చి జయజయధ్వానాలు చేస్తూ వారికి స్వాగతం పలికారు.
నిజాం పాలన నుంచి విముక్తి లభించడంతో ఆ రోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌తో సహా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రజలు సంబురాలు జరుపుకున్నారు.