జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని కేటీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక మాగంటి గోపీనాథ్ భార్య సునీతని అభ్యర్ధిగా బరిలో దింపారు.
ఆ నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి ఈ ఉప ఎన్నికలలో ఆమెని గెలిపించుకోవడానికి అందరూ గట్టిగా కృషిచేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ తరపున మహ్మద్ అజారుద్దీన్ పోటీ చేయాలనుకుంటే, సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి బరిలో నుంచి తప్పించారు. కనుక ఆ స్థానంలో చాలా బలమైన అభ్యర్ధిని బరిలో దించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు పార్టీ, పదవి ఏవీ లేకుండా ఒంటరిగా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. కనుక ఈ ఉప ఎన్నికలలో తెలంగాణ జాగృతి అభ్యర్ధిని గెలిపించుకొని తన సత్తా చాటుకొని తెలంగాణ రాజకీయాలలో నిలదొక్కుకోవాలనుకోవడం సహజం.
ఇటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఓ అనూహ్యమైన పరిణామం జరిగింది. పి. విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు.
అయన గతంలో రెండుసార్లు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి మాగంటి చేతిలో ఓడిపోయారు. కనుక ఈసారి పోటీ చేస్తే సులువుగా గెలవవచ్చనుకున్నారు. కానీ జూబ్లీహిల్స్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తారని కేటీఆర్ ప్రకటించడంతో విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం లేకుండా పోయింది.
కనుక తెలంగాణ జాగృతి అభ్యర్ధిగా బరిలో దిగాలనే ఉద్దేశ్యంతోనే కల్వకుంట్ల కవితతో భేటీ అయినట్లు స్పష్టమవుతోంది. కానీ పెద్దమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలకు ఆమెను ఆహ్వానించేందుకే కలిశానని, తాను బీఆర్ఎస్ పార్టీతోనే సాగుతానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.
కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కల్వకుంట్ల కవిత విష్ణువర్ధన్ రెడ్డి లేదా మరొక అభ్యర్ధిని బరిలో దించి, కేసీఆర్ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తే ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి లాభించవచ్చు.