రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం గోవాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, “పాక్ సైనికులకి మనవాళ్ళు చాలా ధీటుగా బదులివ్వడంతో పాక్ కాళ్ళ బేరానికి వచ్చి దాడులు నిలిపివేయమని బ్రతిమాలుకొంది. మాకేమి అభ్యంతరం లేదు..ముందు మీరు కాల్పులు ఆపండి అని గట్టిగా చెప్పాము. అంతే..పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి,” అని చెప్పారు.
భారత్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ చేసినప్పుడు కూడా ఆయన ఈవిధంగా గొప్పలు చెప్పుకోలేదు కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలో చెప్పుకొంటున్నారు. అంటే ఎన్నికలని దృష్టిలో పెట్టుకొనే ఈ హడావుడి చేస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలని ధృవీకరిస్తున్నట్లుంది.
అయితే మనోహర్ పారిక్కర్ చెప్పుకొంటున్నట్లు పాకిస్తాన్ ఇటువంటి తాటాకు చప్పుళ్ళకి బెదిరిపోయే రకం కాదని మళ్ళీ కాల్పులు మొదలైనప్పుడు ఆయనే గ్రహిస్తారు. పాక్ ఎందుకు కాల్పులు ఆపివేసి ఉండవచ్చంటే, పాకిస్తాన్ ఆర్మీలో ప్రస్తుతం అధికార మార్పిడి కార్యక్రమం జరుగుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహెల్ షరీఫ్ సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బహుశః అందుకే పాక్ తాత్కాలికంగా కాల్పులు విరమించి ఉండవచ్చు.
పాక్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోతున్న జావేద్ బాజ్వా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో క్రియాశీలకమైన పాత్ర (అంటే అక్కడ తిష్టవేసుకొన్న పాక్ ఉగ్రవాదులకి శిక్షణ?) పోషించారు. కనుక ఆయన ఆర్మీ భాద్యతలు తీసుకోగానే ఇప్పటికంటే ఇంకా తీవ్రంగానే భారత్ సైనికులపై దాడులు చేయించవచ్చు. అప్పుడు మనోహర్ పారిక్కర్ చెప్పుకొన్న ఈ గొప్పలని దిగమింగుకోవలసి వస్తుంది.
కనుక ఆయన పాకిస్తాన్ని తక్కువ అంచనా వేసి ఈవిధంగా గొప్పలు చెప్పుకొని నవ్వుల పాలవడం ఆ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకొంటే మంచిది. గోవా ఎన్నికలకి అది సరిపోతుంది. దాని కోసం పాకిస్తాన్ తో యుద్ధం కబుర్లు చెప్పుకోనవసరం లేదు. ఒకవేళ చెప్పుకొంటే ప్రతిపక్షాలు ఆరోపణలని నమ్మవలసి వస్తుంది.