జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఆంద్రా ఎంపిలపై ప్రత్యేకమైన అభిమానం కనబరుస్తుంటారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ని, జగన్ చంద్రబాబుని తలుచుకోకుండా ప్రసంగించలేనట్లే, పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రా ఎంపిలకి చురకలు వేయకుండా ఉండలేరు.
పవన్ కళ్యాణ్ నోట్ల రద్దుని వ్యతిరేకించకపోయినా సమర్ధించడం లేదు. కానీ దాని పర్యవసానాలని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కేంద్రప్రభుత్వమే కారణం కనుక ఆయన భాజపా ఎంపిలనే టార్గెట్ చేసుకొని ఈరోజు ట్వీటర్ లో చురకలు వేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిలు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలబడి సామాన్య ప్రజలకి సంఘీభావం తెలిపితే బాగుంటుందని సూచించారు. ఇటీవల కర్నూలులో బాలరాజు అనే పెద్దాయన బ్యాంక్ వద్ద క్యూ లైన్లో నిలబడి ఆ ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయారు. పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులకి సంతాపం తెలిపి, వారికి జనసేన అండగా ఉంటుందని అన్నారు. బ్యాంకులలో దాచుకొన్న డబ్బుని తీసుకోవడానికి సామాన్య ప్రజలు క్యూ లైన్లలో నిలబడి చనిపోతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలలో ఎంపిలు అందరూ బ్యాంకుల వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూ లైన్లలో నిలబడి ప్రజలకి ధైర్యం చెప్పాలని సూచించారు. భాజపా నేతలు సామాన్య ప్రజలకి బ్యాంకుల వద్ద సహకరించాలని కోరారు.
పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశ్యంతో ఎంపిలకి ఈ సూచన చేసినప్పటికీ దానిని వారు పట్టించుకొంటారని ఆశించలేము. ఒక్క ఎంపిలే కాదు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎవరూ కూడా ఇన్ని రోజులలో ఒక్కసారి కూడా బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడిన సామాన్య ప్రజల వద్దకి వచ్చే సాహసం చేయడం లేదు. చాలా అసహనంతో ఉన్న ప్రజల మద్యకి వెళితే ఏమవుతుందో వారికీ తెలుసు అందుకే అసలు బ్యాంకుల వైపు కన్నెత్తి చూడటం లేదు. కానీ రేపు పవన్ కళ్యాణ్ పై ప్రతి విమర్శలు చేయకుండా ఊరుకోరని ఖచ్చితంగా చెప్పవచ్చు.