ఆంధ్రప్రదేశ్ లో అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపాలు ఒకదానిని మరొకటి రాజకీయంగా దెబ్బ తీసేందుకు మైండ్ గేమ్స్ ఆడుకొంటున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో వాటి అభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం వారి చేతికి నిధులు ఇవ్వకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరిట అక్కడి తెదేపా నేతలకి ఇస్తూ పనులని వారిచేతే చేయిస్తోంది. అలాగే వారి ద్వారానే వృద్ధాప్య, వికలాంగ పించన్లని అర్హులకి అందజేస్తోంది. స్తూ ఆ తద్వారా ఆ క్రెడిట్ తెదేపా ప్రభుత్వానికే దక్కేలా జాగ్రత్త పడుతోంది. తెదేపాలోకి ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేలకి కూడా వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం బారీగానే నిధులు మంజూరు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వ్యూహం వలన వైకాపా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఏ చిన్న పని చేయించలేకపోవడంతో ప్రజల దృష్టిలో అసమర్ధులుగా మిగిలిపోతున్నారు.
ఈ పరిస్థితి చూసి వైకాపా కూడా ప్రతివ్యూహం రచించింది. ఆ పార్టీకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు కలిసి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి పిర్యాదు చేశారు. అ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెదేపా ప్రభుత్వం తీరుని, ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుని ఎండగట్టారు. తెదేపా ప్రభుత్వం తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకి నిధులు కేటాయించకుండా తీవ్ర వివక్ష చూపుతోందని అన్నారు. ఒకవేళ కేటాయించినా ఆ నిధులని తెదేపా నేతలు తమకి నచ్చిన పనులకే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలని సమానంగా అభివృద్ధి చేయవలసిన ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటి పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. నిత్యం తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే వైకాపా ఈ వ్యూహంతో ప్రభుత్వంపై బురద జల్లి, తమ నియోజకవర్గాలలో ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పవచ్చు.