ప్రతిపక్షాలు నోట్ల రద్దుని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

November 25, 2016


img

దేశంలో రాజకీయ నాయకులలో చాలా మంది ఏదో ఒక సైడ్ బిజినెస్ చేసుకొంటూనే ఉంటారు. అదీగాక రాజకీయాల ద్వారా కూడా వారు చాలా బారీగానే నల్లధనం పోగేసుకొంతున్నారనేది బహిరంగ రహస్యమే. కనుక మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం అందరి కంటే ఎక్కువగా నష్టపోయేది రాజకీయ నాయకులే అని చెప్పవచ్చు. కనుక నోట్ల రద్దు నిర్ణయం వారందరికీ ఊహించని పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. కానీ ఆ విషయం వారెవరూ బయటకి చెప్పుకోలేరు ఎందుకంటే దాని వలన ప్రజల సానుభూతి కూడా లభించక పోగా ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారు. అందుకే వారు సామాన్య ప్రజల కష్టాలని సాకుగా చూపించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పవచ్చు. ఒకవేళ కేంద్రప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటే దాని వలన నల్లధనం కలిగి ఉన్నవారికే మేలు కలుగుతుంది తప్ప సామాన్య ప్రజలకి ఎటువంటి మేలు కలుగదని ప్రజల కోసం మొసలి కన్నీళ్ళు కారుస్తున్న ప్రతిపక్షాలకి కూడా తెలుసు. 

ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ తాత్కాలికమైనవే తప్ప శాస్వితమైనవి కావనే సంగతి కూడా వారికి చాలా బాగా తెలుసు. దేశంలో ఈ సమస్యలన్నీ తొలగిపోయి మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడినట్లయితే అప్పుడు సామాన్య ప్రజలు కూడా తమని పట్టించుకోరు పైగా నోట్ల రద్దు ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఎదురు ప్రశ్నించవచ్చునని కూడా ప్రతిపక్షాలకి తెలుసు. అందుకే ఈ సమస్యల తీవ్రత పూర్తిగా తగ్గక మునుపే ప్రజలని రెచ్చగొట్టి వారి ఆగ్రహాన్ని కేంద్రప్రభుత్వంపైకి మళ్ళించి నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి  చేస్తున్నాయని చెప్పవచ్చు.    



Related Post