ఈరోజు రాజ్యసభలో సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు నరేష్ అగర్వాల్ నోట్ల రద్దుపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడుతూ “నోట్ల రద్దు నిర్ణయం ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి కూడా ముందుగా తెలియదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ ఆయనకి తెలిసి ఉండి ఉంటే ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు కనుక ఆయన ఆ విషయం నాకు ముందుగానే తప్పక చెప్పి ఉండేవారు,” అని అన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ ఇద్దరూ చిర్నవ్వులు చిందించారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఆలోచన రేకెత్తిస్తుంది.
నోట్ల రద్దు నిర్ణయం నిజంగానే దేశ అర్దికమంత్రికి తెలియకుండానే జరిగిందా? అంటే నమ్మశక్యంగా లేదు. ఆ ప్రశ్నకి మోడీ, జైట్లీ ఇద్దరూ సమాధానం చెప్పడం లేదు. ఇక మరో విషయం ఏమిటంటే ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న పరస్పర విరుద్దమైన వాదనలు. ఈ విషయం అరుణ్ జైట్లీకి కూడా తెలియదని వాదిస్తున్న ప్రతిపక్షాలే దీని గురించి మోడీ సన్నిహితులు చాలా మందికి ముందే సమాచారం అందిపోయిందని, అందుకే నల్లకుభేరులు ఎవరూ ఇంతవరకు బయటపడలేదని వాదిస్తున్నారు.
ఒకవేళ మోడీ తన ఆర్దికమంత్రికే చెప్పకుండా గోప్యత పాటించినట్లయితే ఆ రహస్యాన్ని వేరే వాళ్ళకి ముందే చెప్పి తను ఆశించిన ప్రయోజనానికి (నల్లధనం వెలికితీత)కి ఎందుకు భంగం కలిగించుకొంటారు? తన ప్రయోజనం నెరవేరడం కంటే నల్లధనం పోగేసుకొన్న వారిని కాపాడటమే ముఖ్యమనుకొన్నట్లయితే మోడీ తన రాజకీయ భవిష్యత్ ని, తన పార్టీ భవిష్యత్ ని, తన ప్రభుత్వాన్ని, చివరికి తన ప్రాణాలని కూడా పణంగా పెట్టి ఈ నోట్లు రద్దు నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమిటి? అని ఆలోచిస్తే ప్రతిపక్షాల వాదనలు ఎంత అర్ధరహితమో అర్ధం అవుతాయి.
అయితే మరి ప్రతిపక్షాలు ఎందుకు మోడీపై విరుచుకుపడుతున్నాయి? అంటే ఈ నిర్ణయం వలన ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల ఆగ్రహాన్ని మోడీ ప్రభుత్వంపై మళ్ళించేందుకే ప్రతిపక్షాలు ఇటువంటి వితండ వాదనలు చేస్తున్నాయని చెప్పవచ్చు. వాటికి నిజంగా సామాన్య ప్రజలపై అంత ప్రేమ ఉండి ఉంటే ఈ 15 రోజులలో అవి వారి సమస్యలని తీర్చడం కోసం కృషి చేసేవి. కానీ ఆ పని చేయకుండా ఈ అంశాన్ని మంచి రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొని మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాయి.
అదృష్టవశాత్తు ప్రధాని నరేంద్ర మోడీ వాటి ఒత్తిడికి లొంగి తన నిర్ణయం వెనక్కి తీసుకోకుండా చాలా దృడంగా నిలబడ్డారు. అదే ఆయన వాటి ఒత్తిడికి లొంగి నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉంటే దేశ ఆర్ధిక వ్యవస్థ ఒకేసారి కుప్పకూలిపోయేది. దేశంలో కొత్తనోట్లని కానీ పాతనోట్లని గానీ మళ్ళీ చలామణి చేయలేని పరిస్థితి ఏర్పడితే ఏమవుతుందో ఊహించుకొంటే ప్రతిపక్షాల డిమాండ్ ఎంత భయంకరమైనదో అర్ధం అవుతుంది.