రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని ఫిరాయింపులకి ప్రోత్సహించి అనేక మంది ఎమ్మెల్యేలని తమ పార్టీలలో చేర్చుకొన్నారు. వచ్చే ఎన్నికలలోగా శాసనసభ నియోజకవర్గాల సంఖ్య తప్పకుండా పెరుగుతుందని, కనుక కొత్తగా ఎంతమంది వచ్చి చేరినా వారికీ, పార్టీలో ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలకి సీట్ల కొరత ఉండబోదని భరోసా ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకొన్నారు. కానీ 2026 వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా శాసనసభ నియోజకవర్గాలని పునర్విభజించి వాటి సంఖ్యని పెంచే ఉద్దేశ్యం లేదని కేంద్రప్రభుత్వం పదేపదే చెపుతోంది. మళ్ళీ నిన్న కూడా హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకి మళ్ళీ అదే సమాధానం ఇచ్చారు. అంటే 2026వరకు దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం లేదని స్పష్టం అవుతోంది.
కనుక తెరాస, తెదేపాలలో కొత్తగా వచ్చి చేరిన వారికి లేదా వారి వలన పార్టీలోని సిటింగ్ ఎమ్మెల్యేలకి టికెట్స్ దొరకకపోవచ్చునని అర్ధం అవుతోంది. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాబోదు కనుక రెండు పార్టీలలో రానున్న రోజులలో అంతర్గత కుమ్ములాటలు మొదలవవచ్చు లేదా మళ్ళీ పార్టీ ఫిరాయింపులు తప్పకపోవచ్చు.
తెలంగాణాలో కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేశారు కనుక కొన్ని నియోజకవర్గాలు రెండు జిల్లాల మద్య విడిపోయాయి. దాని వలన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. పార్టీ ఫిరాయించిన వారందరూ ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు కనుక మరొక ఏడాదిన్నర పాటు అధికారం అనుభవించిన తరువాత, మళ్ళీ ఫిరాయింపులకి సిద్దపడవచ్చు. కానీ అదే జరిగితే, తెదేపా, తెరాసలకి ఎదురు ఉండకూడదనే ఆశయం నెరవేరదు పైగా ఎన్నికలకి ముందు రెండు పార్టీలు తీవ్ర ఓడిడుడుకులకి లోనయితే అవి కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సంగతి కేసీఆర్, చంద్రబాబులకి తెలియదనుకోలేము కానీ ఇద్దరూ అసలు అటువంటి సమస్యే ఉత్పన్నం కాదన్నట్లు చాలా ధీమాగా వ్యవహరిస్తుండటం విశేషం. వారు ధీమాకి కారణాలు ఏమిటో తెలియదు కానీ చివరికి ఎమ్మెల్యేలే నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.