భారత్-పాక్ సరిహద్దుల వద్ద యధేచ్చగా కాల్పులు కొనసాగుతున్నాయి. “అందుకు మీరే కారణం అంటే కాదు మీరే” అని రెండు దేశాలు ఒకదానినొకటి నిందించుకొంటూనే కాల్పులు కొనసాగిస్తున్నాయి. వాటిలో ఇరుదేశాలకి చెందిన సైనికులు అనేకమంది చనిపోతూనే ఉన్నారు. ఆ లెక్కల్లో కూడా చాలా తేడాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ కాల్పులలో నిత్యం ఇరుదేశాలకి చెందిన కొందరు సైనికులు చనిపోతున్నారనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు. మూడు రోజుల క్రితం పాక్ సైనికుల చేతిలో ముగ్గురు భారత్ సైనికులు చనిపోతే వారిలో ఒకరి శవాన్ని పాక్ సైనికులు ముక్కలు ముక్కలు చేయడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న పాక్ సైనిక పోస్టులపై మెషిన్ గన్స్, 120 ఎం.ఎం. హెవీ మోర్టార్లతో చేసిన దాడులలో సుమారు 12మంది పాక్ జవాన్లు మరణించినట్లు పేర్కొంది.
ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో జవాబివ్వడం ఖాయం కనుక భారత్ కూడా మళ్ళీ కొందరు సైనికులని లేదా సరిహద్దు గ్రామాలలో సామాన్య ప్రజలని కోల్పోయే అవకాశం ఉంది. ఇటువంటి దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నంత కాలం వాటిలో మరణించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఆగిపోదు. కనుక దీనికి ఏదో విధంగా ముగింపు పలకవలసిన అవసరం ఉంది. లేకుంటే ఇరు దేశాలు నష్టపోతాయి.
నిన్న పాక్ పోస్టులపై భారత్ దాడులు చేసిన తరువాత, పాక్ దిగివచ్చి కాల్పులు విరమణ గురించి మాట్లాడుకొందామని ప్రతిపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. పాక్ సైనికులకి ధీటుగా జవాబు చెప్పి చాలా మందిని మట్టుబెట్టమని చెప్పుకోవడం, వినడం గొప్పగానే ఉంటుంది. కానీ మళ్ళీ పాక్ సైనికులు దాడిలో భారత్ జవాన్లు మరణించారని వినడం చాలా కష్టంగా ఉంటుంది. కనుక ఒకవేళ పాకిస్తాన్ నుంచి రాజీ ప్రతిపాదనలేవీ రాకపోయినా, భారత్ చొరవ తీసుకొని పాక్ సైన్యాధికారులతో మాట్లాడి ఈ పోరాటానికి ముగింపు పలుకడం మంచిది.