నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు, వాటివలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలు, చిల్లర వ్యాపారులు, రైతులు విమర్శిస్తున్నారు. వాటిలో ప్రతిపక్షాల విమర్శలు , ఆరోపణలు పట్టించుకొనవసరం లేదు. అవి రాజకీయ దురుదేశ్యంతో కూడుకొన్నవి కావచ్చు లేదా అవి నల్లకుభేరుల తరపున చేస్తున్న పోరాటాలు కావచ్చు. కానీ నోట్ల రద్దు కారణంగా దేశంలో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడమేనని స్పష్టం అవుతోంది. అయితే కేంద్రప్రభుత్వం గత ఆరు నెలలుగా మైసూర్ ప్రెస్ లో రహస్యంగా పెద్ద నోట్లు ముద్రించి, రిజర్వ్ బ్యాంక్ కి తరలిస్తూనే ఉంది. ఈ నిర్ణయం ప్రకటించడానికి నెలరోజుల ముందే రూ.100, 2,000 నోట్లని దేశంలో చాలా బ్యాంకులకి తరలించి సిద్దంగా ఉంచినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ సమస్య ఏర్పడింది ఎందుకు అంటే ముందుగా పెద్ద నోట్లనే ఎక్కువగా ముద్రించి సర్క్యులేషన్ లోకి తీసుకురావడం వలననే అని చెప్పవచ్చు. కేంద్రప్రభుత్వం కారణాలు దానికి ఉండవచ్చు కానీ అదే పెద్ద పొరపాటని రుజువు అయ్యింది.
ముందుగా రూ.2,000 నోట్లని ప్రవేశపెట్టినట్లయితే, దేశంలో సర్క్యులేషన్ లో ఉన్న 86 శాతం కరెన్సీని ఉపసంహరించుకొంటున్నప్పుడు ఏర్పడబోయే ఒత్తిడిని తట్టుకోవచ్చని కేంద్రం భావించి ఉండవచ్చు. దానితో ఉపసంహరణ-సరఫరాకి మద్య ఏర్పడిన ఆ వ్యత్యాసం బారీగా తగ్గుతుందని కేంద్రప్రభుత్వం భావించి ఉండవచ్చు లేదా వేరే ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు. కానే అదే పెద్ద పొరపాటని అర్ధం అవుతోందిప్పుడు. దేశ ఆర్ధిక వ్యవస్థ అంతా రూ.100,500, 1000 నోట్లతోనే నడుస్తున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఒకే పెద్ద నోటుని తేవడమే పొరపాటు అని రుజువు అయ్యింది. అదే కేంద్రప్రభుత్వం మొదటే రూ.100, 500 నోట్లని మాత్రమే ముద్రించి సరఫరా చేయడం మొదలుపెట్టి ఉండి ఉంటే బహుశః ఇంత సమస్య ఎదురయ్యేది కాదేమో? ఇప్పుడు జరిగిన పొరపాట్లని నెమరువేసుకొని బాధ పడటం కంటే దీని నుంచి ఏవిధంగా బయటపడాలని కేంద్రప్రభుత్వం ఆలోచించవలసి ఉంటుంది.
దేశంలో అన్ని రాష్ట్రాలకి కొత్త నోట్ల సరఫరా శరవేగంగా సాగుతున్నందున, ప్రధాన నగరాలు, పట్టణాలలో తప్ప మిగిలిన ప్రాంతాలలో క్రమంగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. పెద్ద నగరాలూ, పట్టణాలలో డబ్బు వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఆ డిమాండ్ కి తగినంత కొత్త నోట్లు బ్యాంకులు అందించలేకపోతున్నాయి. ఆ కారణంగానే దేశంలో పెద్ద నగరాలు, పట్టణాలలో నేటికీ ఎటిఎంల వద్ద పెద్దపెద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాలలో ప్రతిపక్షాలు, మీడియా చేపుతునంత భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు లేవు. కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో పరిస్థితులని నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. వాటి వలన కూడా కొంత ఉపశమనం కలుగుతోంది. దేశహితం కోసం కేంద్రప్రభుత్వం ఒక మంచి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొంది. కనుక ‘ఐ లవ్ మై ఇండియా’ అనే నినాదం కేవలం మాటలకి, వాహనాలపై స్టిక్కర్లకే పరమితం చేయకుండా దేశాన్ని ప్రేమించేవారందరూ ఇప్పుడు తమ దేశభక్తి నిరూపించుకొనే అవకాశం కలిగింది. దేశం కోసం ఎవరూ ఏ త్యాగాలు చేయనవసరం లేదు కేవలం కొన్ని రోజులు ఓపిక పడితే చాలు. అన్నీ సర్దుకొంటాయి.