నోట్ల రద్దయిన రెండు వారాల తరువాత మళ్ళీ నిన్న ప్రజలు, మీడియా ముందుకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దానిపై స్పందిస్తూ “ప్రతీ విషయంపై నేనే స్వయంగా మాట్లడనవసరం లేదు. మా పార్టీ అధికార ప్రతినిధులు దానిపై అప్పుడే స్పందించారు. నోట్ల రద్దుని స్వాగతిస్తున్నాము కానీ అది చాలా తొందరపాటు చర్య అని భావిస్తున్నాను. కేంద్రప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొంది. దాని వలన దేశ ప్రజలు అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. మా పార్టీ ప్రజల తరపున నిలబడుతుంది కనుక వారి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తాము,” అని జగన్ అన్నారు.
ఒకప్పుడు జగన్ స్వంత కుంపటి పెట్టుకొన్న కొత్తలో రోజూ తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నామస్మరణ చేస్తూ ప్రజలని ఆకట్టుకోగలిగారు. ప్రజల సానుభూతిని పొంది పార్టీని బలోపేతం చేసుకొన్నారు. కానీ ఇప్పుడు తన తండ్రికి బదులు తన ప్రియ శత్రువు చంద్రబాబు నామస్మరణ చేయకుండా ఉండలేకపోతున్నారు.
నిన్న ఈ అంశంపై మాట్లాడినప్పుడు “నోట్ల రద్దు నిర్ణయం గురించి చంద్రబాబుకి ముందే సమాచారం అందింది. అందుకే ఆయన అన్నీ ముందే చక్కబెట్టేసుకొన్నారు. నోట్ల రద్దు చేయమని మోడీని నేనే ఒప్పించానని గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు, సమస్యలు ఎదురవగానే మాట మార్చి కేంద్రప్రభుత్వంపై ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. మంచి జరిగితే ఆ క్రెడిట్ తనది...చెడు జరిగితే మోడీదే బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు,” అని జగన్ విమర్శించారు.
ఈ విషయంలో చంద్రబాబు తన ద్వంద వైఖరి మరొకసారి బయటపెట్టుకొన్న మాట వాస్తవం. అయితే ఆయన అక్టోబర్ 12న వ్రాసిన లేఖని చూసే మోడీ ఈ నిర్ణయం తీసుకొన్నారని, జగన్ విమర్శించడం, చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం రెండూ తప్పే. ఎందుకంటే ఆరు నెలల క్రితం నుంచే మైసూర్ లో రూ.2,000 నోట్లు ముద్రించడం, వాటిని ప్రత్యేక విమానంలో రిజర్వ్ బ్యాంక్ కి తరలించడం మొదలైంది. అయితే దేశంలో నల్లధనం అరికట్టాలంటే రూ.500, 1,000 నోట్లని రద్దు చేయాలని చంద్రబాబు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మాట కూడా నిజమే కనుక ఆయన సూచనని మోడీ పరిగణనలోకి తీసుకొని ఉండవచ్చు.