భారత్ ఆర్మీ పాక్ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసినప్పటికీ, పాక్ సైన్యాధికారులు, పాలకులు దానిని అంగీకరించలేదు. అంగీకరిస్తే దేశ ప్రజలు, ప్రపంచ దేశాలు, ప్రతిపక్షాలు ముందు సిగ్గుతో తల దించుకోవలసి ఉంటుంది. ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పించినట్లు చాటుకొన్నట్లు అవుతుంది. కనుక తేలు కుట్టిన దొంగలాగ మౌనంగా ఆ బాధ భరించవలసి వచ్చింది.
కానీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన సంగతి పాక్ ప్రజలతో సహా అందరికీ తెలుసు. కనుక అప్పటి నుంచి సరిహద్దుల వద్ద పాక్ సైనికులు కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా కాల్పులలో మరణించిన భారత జవాన్ల శరీరాలని పాక్ సైనికులు ముక్కలు ముక్కలు చేసి వెళ్ళిపోతున్నారు.
ఈరోజు ఉదయం నుంచి మచ్చాల్ సెక్టార్ లో ఇరుదేశాల సైనికుల మద్య భీకర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పాక్ సైనికుల కాల్పులలో ఈరోజు ముగ్గురు భారత జవాన్లు మరణించారు. వారిలో ఒకరి శవాన్ని పాక్ సైనికులు ముక్కలు ముక్కలు చేసి వెళ్ళిపోయారు. అది చూసి ప్రతీ భారత్ సైనికుల ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాక్ పై మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు.
శత్రుసేనలు ఒకరినొకరు డ్డీ కొన్నప్పుడు కాల్పులు జరుపుకోవడం సహజమే కానీ ఈవిధంగా సైనికుల శరీరాలు చిద్రం చేయడం సైనిక విధానం కాదు. కానీ పాక్ సైనికులు పదేపదే ఈ నీచానికి పాల్పడుతూ భారత్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. పాక్ పాలకులు, సైన్యాధికారుల వికృత ఆలోచనలకి అద్దం పడుతున్నట్లుగా వారి సైనికులు ప్రవర్తిస్తున్నారు.
రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ కూడా అటువంటి సంకేతమే ఇచ్చారు. త్వరలోనే దీనికి ప్రతీకారం తీర్చుకొంటామని పాక్ సైన్యం అందుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు భారత్ ని పాలించిన కాంగ్రెస్ పాలకులు ఖండన ప్రకటనలతో సరిపెట్టేవారు. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూటాకి తూటాతోనే బదులిస్తోందని గ్రహించినప్పటికీ పాక్ తన దుశ్చర్యలని మానుకోలేకపోతోంది. భారత్ సహనం నశిస్తే ఏమవుతుందో ఊహించవచ్చు. భారత్-పాక్ మద్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే దానిలో ఏ దేశం గెలిచినా, ఏ దేశం ఓడిపోయినా రెండు దేశాలు మళ్ళీ దశాబ్దాల పాటు కోలుకోలేనంతగా దెబ్బ తింటాయి. ఆ ఆలోచనతోనే భారత్ వెనకడుగు వేస్తుంటే పాక్ దానిని అలుసుగా భావించి రెచ్చిపోతోంది.