మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మృతి

November 22, 2016


img

ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ (86) మంగళవారం సాయంత్రం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్నారు. 

మంగళంపల్లి బాలమురళికృష్ణ జూలై 6, 1930లో ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో శంకరగుప్తం గ్రామంలో  జన్మించారు. కానీ మద్రాస్ వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. మద్రాస్, మ్యూజిక్ అంటే తనకి చాలా ఇష్టమని వాటిని విడిచిపెట్టి ఉండలేనని చెప్పేవారు. చెప్పినట్లుగానే ఆయన తుదిశ్వాస వరకు వాటితోనే సాగారు. 

 అయన సంగీత ప్రతిభ గురించి వర్ణించడం అంటే కొండని అద్దంలో చూపే ప్రయత్నమే అవుతుంది. ఆయన అందుకొన్న అవార్డుల గురించి వ్రాయాలంటే అదే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. ఇక సంగీతంలో ఆయన చేసినన్ని ప్రయోగాలు దేశంలో మరే వాగ్గేయకారుడు చేసి ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 

ఆయన తల్లితండ్రులిద్దరూ సంగీత కళాకారులే కావడంతో ఉగ్గుపాలతోనే సంగీతం నేర్చేసుకొని ఆరేళ్ళ వయసులోనే విజయవాడలోని త్యాగరాజ ఆరాధనోత్సవాలలో తొలి సంగీత కచేరీ ఇచ్చి అందరినీ మెప్పించిన ఘనుడు మంగళంపల్లి మురళికృష్ణ. అప్పటి నుంచే ఆయనకి బాలమురళికృష్ణ పేరుతో ప్రసిద్దులయ్యారు. 

ఆయన రెండు వేర్వేరు సంగీత ప్రపంచాలలో జీవించారు. ఒకటి సినీ సంగీత ప్రపంచం. మరొకటి కర్ణాటక సంగీత ప్రపంచం. రెంటిలోనూ ఆయన తన ముద్రని వేసి వెళ్ళిపోయారు. కర్నాటక సంగీతంలో ఆయన చేసిన కచేరీలు, సృష్టించిన అనేక కొత్త కొత్త రాగాలు, కృతులు, వర్ణాలు, జావళీలు సమకాలీన సంగీత విద్వాంసులలో మరెవరూ సృష్టించలేదనే చెప్పవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 400 సినిమాలకి సంగీతం సమకూర్చారు. 

ఆయన దేశ విదేశాలలో చేసిన కచేరీలకి లెక్కే లేదు. అలాగే వాటి వలన అందుకొన్న పురస్కారాలకి కూడా లెక్కే లేదు. భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చి సత్కరించింది. దేశ విదేశాలలో సంస్థలు సంగీత కళానిధి, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, సంగీత కళా సరస్వతి, గాన కౌస్తుభ, గాన కళా భూషణ, గాన పద్మం, నాద జ్యోతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞానసాగర వంటి అనేక అవార్డులు, డాక్టరేట్ పట్టాలతో ఆయనని గౌరవించాయి. ఆయనని గౌరవించాయి అని చెప్పడం కంటే అటువంటి మహాకళాకారుడుని తాము సన్మానించామని గర్వంగా చెప్పుకొనే అవకాశం పొందాయని చెప్పవచ్చు. బాలమురళికృష్ణ గొంతు నుంచి అపూర్వమైన ఆ గందర్వ గానం ఇక మనకి వినిపించకపోయినా, ఆయన దశాబ్దాలుగా పాడిన పాటలు సూర్యచంద్రులు ఉన్నంతవరకు వినిపిస్తూనే ఉంటాయి.  


Related Post