ఓటుకి నోటు కేసులో నిందితులెవరో అందరికీ తెలుసు. కానీ ఆ కేసుపై తెరాస సర్కార్ ఆసక్తి చూపడం లేదు. కారణాలు అందరికీ తెలిసినవే. ఆ కేసుని అటకెక్కించేసినా దానిని పూర్తిగా వదులుకోవడానికి తెరాస సర్కార్ ఇష్టపడకపోవడం గమనిస్తే, దానిని భవిష్యత్ రాజకీయ అవసరాలకి వినియోగించుకోవాలని భావిస్తోందనుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆ కేసులో నిందితుడుగా ఉన్న మత్తయ్యని విముక్తి చేయడానికి అంగీకరించి ఉండేదే.
ఆ కేసు నుంచి రాష్ట్ర హైకోర్టు మత్తయ్యకి విముక్తి కల్పించడాన్ని తెలంగాణా ఎసిబి సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై నిన్న విచారణ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది హరేన్ రావాల్ ఆ కేసులో మత్తయ్య దోషి అని నిరూపించేందుకు ఎసిబి వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, కనుక అతనికి ఓటుకి నోటు కేసు నుంచి విముక్తి కల్పించరాదని కోర్టుని కోరారు. ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న తరువాత కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యని ఆదేశించి కేసుని రెండు వారాలకి వాయిదా వేసింది.
ఈ కేసు నుంచి మత్తయ్యకి విముక్తి లభిస్తుందా లేదా అనే అంశం పక్కన బెడితే, ఈ కేసు తెరాస సర్కార్ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం వంటిదని చెప్పక తప్పదు. అటువంటి దివ్యాస్త్రాలని సాధారణంగా యుద్దసమయాలలోనే శత్రువులపైనే ప్రయోగిస్తుంటారు. కనుక తమ ప్రభుత్వానికి సవాలు విసురుతున్న రేవంత్ రెడ్డిపై దానిని అవసరం పడినప్పుడు ప్రయోగించడానికే తెరాస సర్కార్ దాచుకొందని చెప్పవచ్చు. కనుక ఆయన కూడా దానిని ఎదుర్కోవడానికి తగిన ఆయుధాలు సిద్దంగా ఉంచుకోక తప్పదు.