ప్రధాని పార్లమెంటుకి రావడం దండగ: రాహుల్

November 21, 2016


img

సినిమాలలో హిట్ పెయిర్స్, హిట్ కాంబినేషన్స్ ఉన్నట్లుగానే రాజకీయాలలో ఒక్కో స్థాయిలో ఒక్కో పెయిర్ లేదా కాంబినేషన్ ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు-జగన్ ఒక కాంబినేషన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే జగన్ లక్ష్యం ఎప్పుడూ చంద్రబాబే. అదేవిధంగా చంద్రబాబు కూడా తన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి జగనే అని భావిస్తూ అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంటారు. తెలంగాణాలో కూడా కేసీఆర్-రేవంత్ రెడ్డిలది అటువంటి కాంబినేషనే అని చెప్పవచ్చు. 

ఇక జాతీయ స్థాయిలో చూస్తే మోడీ-రాహుల్ గాంధీల గురించి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ మోడీకి ఏవిధంగాను సరిపోరు కానీ సరిపోతానని భావిస్తుంటారు. ప్రస్తుతం జాతీయపార్టీలలో భాజపా తరువాత కాంగ్రెస్ పేరే వస్తుంది కనుక దాని యువరాజు రాహుల్ గాంధీని లెక్కలోకి తీసుకోక తప్పదు. 

నోట్ల రద్దుని వ్యతిరేకిస్తున్నవారిలో ఆయన ఒకడు. నిజానికి అయన వారందరికీ నాయకత్వం వహించినా మోడీకి ధీటైన వ్యక్తి అనుకోవచ్చు. కానీ వారికి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎటిఎంల దగ్గరకి వెళ్ళిక్యూలో నిలబడి ప్రజలని ఆకట్టుకొనే ప్రయత్నాలతో సర్దుకుపోతున్నారు. 

ఆయన చాలా అనర్గళంగా తడుముకోకుండా మాట్లాడగలిగే సబ్జెక్ట్ లలో మోడీని విమర్శించడం కూడా ఒకటి. కనుక నోట్ల రద్దుపై మోడీని చాలా చక్కగా విమర్శించారు. “మోడీకి ఎవరినీ సంప్రదించే అలవాటు లేదు. తనకి సన్నిహితులైన ఇద్దరు ముగ్గురు మంత్రులతో కలిసి యావత్ దేశాన్ని ప్రభావితం చేసే ఈ నిర్ణయం తీసుకొని ప్రకటించేశారు. కనీసం తన మంత్రివర్గంలో మంత్రుల్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కనుక ఆయన పార్లమెంటుకి రావలసిన అవసరం కూడా  లేదు. ఆయనని మామూలు ప్రధాని కాదు సూపర్ ప్రధాని అనాలేమో లేదా ఆయన కోసం కొత్తగా ఒక పదం కనిపెట్టాలి. ఆయన తనకి బాగా సన్నిహితులైన కొందరికి ఈ విషయం గురించి ముందే చెప్పేయడంతో వారందరూ ముందే సర్దేసుకొన్నారు. సామాన్య ప్రజలు తిండి తిప్పలు, తమ పనులు మానుకొని బ్యాంకుల ముందు రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడి ఉంటే, మోడీ సన్నిహితులు దర్జాగా బ్యాంకుల వెనుక ద్వారాల నుంచి తమకి కావలసినంత డబ్బుని తీసుకుపోతున్నారు. దీని వలన వారు మాత్రమే బాగుపడ్డారు. దేశంలో కోట్లాది మంది సామాన్య ప్రజలు, రైతులు, చిల్లర వ్యాపారులు అందరూ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,” అని రాహుల్ గాంధీ విమర్శించారు. 

మోడీ తన సన్నిహితులకి ముందే చెప్పడంతోవారందరూ ముందే సర్దేసుకోన్నారని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ, మరి ఒకవేళ అదే విషయం మోడీ అందరితో చర్చించి నిర్ణయం తీసుకొంటే దేశంలో అందరూ సర్దేసుకొంటారని తెలియదా?ఈ విధంగా చేస్తేనే ఆశించిన ఫలితం వస్తుంది కనుకనే మోడీ దానిని చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచారు. అదే సరైన నిర్ణయమని డిశంబర్ 31వ తేదీకి తేలుతుంది. ఒకవేళ సామాన్యులకి ఈ నోట్ల కష్టాలు లేకుండా మోడీ ప్రభుత్వం ముందుగా మరిన్ని ఏర్పాట్లు చేసి ఉన్నా, లేదా నిర్ణయం ప్రకటించిన తరువాతైనే ఏర్పాట్లు చేసిఉన్నా నేడు రాహుల్ గాంధీ వంటివారు మాట్లాడే అవకాశమే ఉండేదే కాదు. 


Related Post