నోట్ల రద్దు, దాని పర్యవసానాల కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంత తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో బహుశః సామాన్య ప్రజలకి తెలియకపోవచ్చు. కానీ వారికి కూడా అర్ధమయ్యేవిధంగా అయన గోవాలో ఒక మాట చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారి వలన తనకి ప్రాణహాని ఉందని అయినా తాను వెనక్కి తగ్గబోనని అన్నారు. ఆయన ప్రజల సానుభూతిని పొందడం కోసం ఆ మాట అనలేదు. ఆయన నిర్ణయం వలన దేశంలో అనేక వందలు..వేలమంది నల్లకుభేరులు దశాబ్దాలుగా నిర్మించుకొన్న నల్లసౌధాలు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది కనుక వారు అంతకి తెగించినా ఆశ్చర్యం లేదు.
అయితే ఇదొకటే కాదు...మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టారని చెప్పవచ్చు. నల్లధనం ఉన్నవారిలో అత్యధికులు రాజకీయ నాయకులే అనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ మోడీకి వ్యతిరేకంగా చేతులు కలిపి ఒకటయ్యాయి. వాటితో శివసేన వంటి భాజపా మిత్రపక్షం కూడా చేతులు కలిపింది. ఎన్డీయే కూటమిలో ఇంకా ఎన్ని పార్టీలు, ఎంతమంది నేతలు మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనే విషయం బయటకి పొక్కలేదు. కానీ మోడీ నిర్ణయం వలన నష్టపోయిన వారందరూ ఆయన చెప్పే దేశభక్తి పాఠాలు వింటారని అనుకోలేము.
ఇంక భాజపాలోనే ఎంత మంది నేతలు మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారో తెలియదు. బహుశః ఆ కారణం చేతనే చాలా మంది భాజపా నేతలు దీని గురించి అసలు మాట్లాడటానికే ఇష్టపడటం లేదు. ఇటువంటి క్లిష్ట సమయంలో భాజపా నేతలు అందరూ మోడీకి అండగా నిలబడకపోవడం అదే అనుమానం కలిగిస్తోంది. కనుక మోడీ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పవచ్చు. ఒకవేళ ఈ ప్రయత్నంలో ఆయన సఫలం అయితే దేశం బాగుపడుతుంది. ఆయనకి ఇక ఎదురు ఉండదు. కానీ విఫలం అయితే మాత్రం మోడీ చాలా బారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
మోడీ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ‘పులిపై సవారీ చేయడంగా’ అభివర్ణించారు. దాని వలన మిత్రపక్షాలలో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోందని అన్నారు. అయితే దేశహితం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నప్పుడు అందరూ ఆయనకి మద్దతు పలకాలని నితీష్ కుమార్ అన్నారు.
మోడీ గురించి నితీష్ కుమార్ వెలిబుచ్చిన అభిప్రాయలు అక్షరాల సత్యమని చెప్పవచ్చు. ఇంతవరకు వచ్చిన తరువాత ఆయన ఆ పులిపై నుంచి క్రిందకి దిగితే అదే ఆయనని మింగేసే ప్రమాదం ఉంది. కానీ ధైర్యం చేసి ముందుకే సాగితే నితీష్ కుమార్ చెప్పినట్లు మిత్రపక్షాలలో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
కానీ మంచి నాయకత్వ లక్షణాలు గల మోడీ ఆ పులిని మచ్చిక చేసుకోగలిగితే, ఇక ఆయనని, భారత దేశాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.