డిశంబర్ 31 తరువాత ఏమౌతుంది?

November 19, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు. డిశంబర్ 31 వరకు ప్రజలందరూ తమ వద్ద ఉన్న పాత నోట్లని బ్యాంకులలో జమా చేసి కొత్తనోట్లు తీసుకోవచ్చని చెప్పారు. అనారోగ్యం లేదా విదేశాలలో ఉండిపోయినవారు లేదా ఇతరత్రా కారణాలతో ఈ గడవులోగా పాత నోట్లని మార్చుకోలేకపోయినవారు తమ వద్ద ఉన్న పాతనోట్లని డిశంబర్ 31 తరువాత నుంచి రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కౌంటర్లలో మార్చి 31 వరకు మార్చుకోవచ్చని ప్రధాని చెప్పారు. 

అయితే, అప్పుడు ఆ డబ్బుకి లెక్కలు చెప్పవలసి ఉంటుంది. ఆదాయపన్ను రిటర్న్స్ మరియు ఇతర వివరాలన్నీ సమర్పించవలసి ఉంటుంది. అన్ని పన్నులు చెల్లించి, సరైన లెక్కలు చూపగలిగిన వారికి అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ నల్లధనం పోగేసుకొన్న వారికి ఆ అవకాశం ఉండదు. ఒకవేళ వారు అప్పుడైనా తమ వద్ద ఉన్న నల్లధనానికి పన్నులు, జరిమానాలు చెల్లించడానికి సిద్దపడినా ఆదాయపన్ను దృష్టిలో పడతారు. అప్పటి నుంచి వారిపై ఆదాయపన్ను శాఖ నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఆ బాధలు వద్దనుకొన్న నల్లకుభేరులు తమ వద్ద మిగిలిపోయిన ఆ డబ్బుని ఎవరికీ తెలియకుండా కాల్చివేసో లేదా పెంటకుప్పలు, నదులు, కాలువలలో పడేసి వదిలించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ డబ్బు చిత్తు కాగితాలతో సమానం కనుక దానిని ప్రజలు కూడా తీసుకోరు. 

నోట్లరద్దుతోనే దేశంలో నల్లధనం అంతా తుడిచిపెట్టుకుపోయినప్పటికీ, దానిని గడువులోగానే తెల్లధనంగా మార్చుకొన్న వారు కోకొల్లలు ఉంటారు. కనుక మోడీ అనుకొన్న ప్రయోజనం నెరవేరాలంటే, డిశంబర్ 31 తరువాత అటువంటి నల్లకుభేరులని వెతికిపట్టుకొని వారి భరతం పట్టవలసి ఉంటుంది. ఆదాయపన్ను శాఖ డిశంబర్ 31 తరువాతే నల్లకుభేరులపై దాడులు మొదలుపెడుతుందని అందరూ అనుకొన్నారు కానీ నోట్ల రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే పెద్దపెద్ద బంగారు షాపులు, లిక్కర్ సిండికేట్లపై దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. కనుక డిశంబర్ 31 కంటే చాలా ముందుగా లేదా ఆ తరువాత తప్పకుండా ఆదాయపన్ను అధికారులు నల్లకుభేరులపై దాడులు నిర్వహించవచ్చు. 

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల గోవాలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “దేశంలో నల్లధనం దాచుకొన్నవారిని పట్టుకొనేందుకు అవసరమైతే లక్ష మంది ఉద్యోగులని నియమించుకోవడానికి కూడా వెనుకాడను. నల్లధనం బయటపెట్టిన తరువాత వారి బినామీ ఆస్తుల లెక్కలు సరిచేస్తాను,” అని చెప్పారు. 

అదే సమయంలో మోడీ మరొక మాట కూడా చెప్పారు. తాను ఏ పని చేయదలచుకొన్నా చెప్పే చేస్తానని అన్నారు. నల్లధనం వెలికి తీస్తానని చెప్పిన తరువాత దానికి అవసరమైన చర్యలు చేపట్టానని చెప్పారు. 

ఆ ప్రకారం చూసుకొన్నట్లయితే, డిశంబర్ 31 తరువాత ఆదాయపన్ను శాఖ అధికారులు నల్లకుభేరులపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఈలోగానే వారు తమ వద్ద ఉన్న నల్లధనం అంతా ఏదోవిధంగా వదిలించుకోక తప్పదు.


Related Post