మాల్యాని వదిలి పేదలని పీడిస్తారా?

November 19, 2016


img

ఇటీవల బ్యాంకులు మొండి బకాయిల క్రింద రూ.7,000 కోట్లు రుణాలని మాఫీ చేసినట్లు వార్తలు వచ్చాయి. దానిలో బ్యాంకులకి రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా అప్పు కూడా ఉంది. అయితే ఆ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆ మొండి బకాయిలని తాము రద్దు చేయలేదని వాటిని వేరే ఖాతాలోకి మార్చమని బ్యాంకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశాయి. కానీ ఏ ఖాతాలోకి మార్చినా ఆ డబ్బు ఇక తిరిగి రాదనే సంగతి బ్యాంకులకి తెలుసు...ప్రజలకి కూడా తెలుసు. 

విజయ మాల్యా వంటివాళ్ళు బ్యాంకులకి వేలకోట్లు ఎగవేసి తప్పించుకొని పారిపోతుంటే వారి ఆస్తులని జప్తు చేసి తమ బాకీలు వసూలు చేసుకోవలసిన బ్యాంకులు, ఆ పని చేయకుండా వాటిని మొండి బకాయిల పద్దులో వ్రాసేసి మాఫీ చేసేస్తున్నాయి. కానీ దేశానికి అన్నం పెట్టే నిరుపేద రైతన్నలు పంటలు పండించడం కోసం ఒక లక్షో..రెండు లక్షలో బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొంటే వాటిని వడ్డీతో సహా వసూలు చేస్తుంటాయి. ఆ రుణాలని మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని నిలబెట్టుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తూ ఏడాదికి కొంత కొంత చొప్పున చెల్లిస్తున్నాయి.

విజయ్ మాల్యా వంటి వారు బ్యాంకులకి వేల కోట్లు ఎగవేసి లండన్ పారిపోయి దర్జాగా బ్రతుకుతుంటే, ఒకటి రెండు లక్షల అప్పులు తీర్చుకోలేక తీవ్ర ఆర్ధిక సమస్యలలో చిక్కుకొని అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయినా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పదంతో స్పందించడం లేదు. కానీ బ్యాంకులని ఉద్దేశ్యపూర్వకంగా మోసం చేసి లండన్ పారిపోయి దర్జాగా జీవిస్తున్న విజయ్ మాల్యా వంటి వారిపట్ల చాల మానవత్వంతో వ్యవహరిస్తుంటాయి. 

అదే విషయం ప్రొఫెసర్  కోదండరామ్ అడిగారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పేదల కడుపులు కొట్టి పెద్దలకి పెడుతున్నాయని విమర్శించారు. నోట్ల రద్దుని తాను స్వాగతిస్తున్నానిని అన్నారు. తరువాత బినామీ ఆస్తులు, బంగారం రూపంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నిర్ణయం వలన తాత్కాలికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, దీని వలన దేశానికి, రాష్ట్రానికి చాలా మేలు కలుగుతుందని అన్నారు. సామాన్యప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తగిన చర్యలు చేపట్టాలని కోరారు. 

బ్యాంకులు పేదలని పీడిస్తూ ఉన్నత వర్గాలని వెనకేసుకొని వస్తూ వారి అప్పులు మాఫీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలకే బ్యాంకులు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు చాలా కష్టపడి సంపాదించి దాచుకొన్న తమ డబ్బుని బ్యాంకులలో జమా చేసుకోవడానికి వస్తున్నప్పుడు వారిని భయబ్రాంతులు చేసేవిధంగా వ్యవహరించవద్దని ప్రొఫెసర్  కోదండరామ్ బ్యాంకులకి విజ్ఞప్తి చేశారు. నిజమే కదా!


Related Post