ఎర్ర కండువాలు కప్పుకొన్న గంగిరెద్దులవి: కేటిఆర్

November 18, 2016


img

రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ తెలంగాణా సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తున్న మహా పాదయాత్రని ఆక్షేపిస్తూ “ఎర్ర కండువాలు కప్పుకొన్న గంగిరెద్దులవాళ్ళు పొలం గట్ల మీద తిరుగుతుంటే, సంక్రాంతికి రావలసినవి అప్పుడే ముందే వచ్చేశాయేమిటి? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజల కోసం మొసలి కన్నీళ్ళు కారుస్తూ వారు చేస్తున్న పాదయాత్రలని చూసి నవ్వుకొంటున్నారు. రాష్ట్రంలో తెదేపా కనబడకుండా పోయింది. కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మా ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి మేలు కలిగించే పనులు చేస్తున్నప్పటికీ భాజపా నేతలు నోటికి వచ్చినట్లు అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు మాత్రమే అయ్యింది. కొత్త కాపురం కుదురుకోవడానికి కొంచెం సమయం పట్టినట్లుగానే మా ప్రభుత్వం కుదురుకోవడానికి మరి కొంత సమయం పడుతుంది. మేము వచ్చి రెండునళ్ళే అయినప్పటికీ దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయని అనేక సంక్షేమ, అభివృద్ధి పధకాలని మా ప్రభుత్వం అమలుచేస్తోంది,” అని మంత్రి కేటిఆర్ అన్నారు.

అధికారంలో ఉన్న తెరాస తన ప్రభుత్వాన్ని ఏవిధంగా సమర్ధించుకొంటూ ప్రజలని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోందో, ప్రతిపక్షాలు కూడా అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. కనుక తమ్మినేని వీరభద్రం చేస్తున్న మహా పాదయాత్రని కేటిఆర్ ఈవిధంగా అవహేళన చేయడం సరికాదనే చెప్పవచ్చు. అంతకంటే, తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏమేమి చేస్తోందో చెప్పుకొని ప్రజలని ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని ఉపేక్షించనవసరం లేదు. ఒక రాజకీయ పార్టీగా తెరాస తనని తాను వాటి దాడుల నుంచి కాపాడుకోవడం తప్పు కాదు. 

అలాగే రాష్ట్రంలో ప్రతిపక్షాలు అడ్డ్రస్ లేకుండాపోయాయని చెప్పుకోవదమూ సరికాదు. ఫిరాయింపులని ప్రోత్సహించి ప్రతిపక్షాలు తుడిచి పెట్టేశామని గర్వంగా చెప్పుకోవలసిన విషయం కాదు. తమ పరిపాలన ద్వారా ప్రజలని మెప్పించి ఎన్నికలలో ప్రతిపక్షాలుని ఓడించినట్లయితేనే అదీ గొప్ప విషయం అవుతుంది. అయినా రాష్ట్రంలో ప్రతిపక్షాలని తుడిచిపెట్టేశామని చెపుతున్నప్పుడు మళ్ళీ అవి చేస్తున్న ఈ హడావుడిని చూసి తెరాస సర్కార్ కంగారుపడటం ఎందుకు? తన పరిపాలనపై తనకి పూర్తి నమ్మకం ఉన్నట్లయితే ప్రతిపక్షాల గురించి ఆలోచించనవసరమే లేదు.      



Related Post