రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరీ అంత విషమంగా ఉందా?

November 17, 2016


img

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలువబోతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి అధికారులతో చర్చించిన తరువాత ఆయన ఫోన్లో ప్రధానితో మాట్లాడారు. అదే విషయాలు నేరుగా మాట్లాడేందుకు అపాయింట్ మెంటు కోరగా రేపు డిల్లీకి రమ్మని ఆహ్వానించారు. కానీ పార్లమెంటు సమావేశాలు సాగుతునందున ఒకవేళ రేపు సాయంత్రం కలువలేకపోతే శనివారం ఉదయం ప్రధానిని కలిసే అవకాశం ఉంది. నోట్ల రద్దు కారణంగా రాష్ట్రం చాలా బారీగా ఆదాయం నష్టపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల విడుదలలో జాప్యం వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు గురించి ప్రధని మోడీకి ముఖ్యమంత్రి వివరించి రాష్ట్రానికి ఆర్ధిక సహాయం అందించవలసిందిగా కోరనున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణా రాష్ట్రం దేశంలో రెండవ ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు గర్వంగా చెప్పుకొన్నారు. అందుకు కారణం హైదరాబాద్ లో ఉన్న ఐటి, సినీ, ఫార్మా మరియు అనేక చిన్నా పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల నుంచి పన్నుల రూపేణా బారీగా ఆదాయం రావడమేనని చెప్పవచ్చు. కానీ పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలంగాణాకి పూర్తి భిన్నంగా ఉంది. దానికి కనీసం పరిశ్రమలు, రాజధాని కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేన్నరేళ్ళుగా నిధుల కోసం డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండటం చూస్తూనే ఉన్నారు. కనుక ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ముందుగా చంద్రబాబు గగ్గోలు పెట్టాలి. కానీ ఆశ్చర్యకరంగా అయన చాల ధీమాగా వ్యవహరిస్తుంటే, తెలంగాణా చాలా ధనిక రాష్ట్రమని చెప్పుకొనే కేసీఆర్ ముందుగా చేతులు ఎత్తేశారు. 

నవంబర్ 25న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తారని ఈరోజు వార్తలు వచ్చాయి. కానీ ఆయన రేపే హడావుడిగా డిల్లీ బయలుదేరుతుండటం గమనిస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నిజంగా అంత ప్రమాదకర పరిస్థితులలోకి వెళ్ళిపోయిందా? అని సందేహం కలుగకమానదు. అదే నిజమైతే ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమా లేక ప్రధాని నరేంద్ర మోడీ తొందరపాటు వలన జరిగిందా? అనే సందేహం కలుగుతుంది. 

ఒకవేళ నోట్ల రద్దు వలననే రాష్ట్రంలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి ఏర్పడిందనుకొన్నా మరి తెలంగాణా కంటే దయనీయంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, బిహార్, ఓడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఎందుకు ఏర్పడలేదు? అనే సందేహం కలుగుతుంది. ఏమైనప్పటికీ, ఈ విషమ పరిస్థితుల నుంచి బయటపడటం కోసం కేంద్రం సహాయం కోరక తప్పదని స్పష్టం అయ్యింది.


Related Post