భాజపా నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారా?

November 16, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ దేశహితం కోసం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొంటే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఆయనని విమర్శిస్తున్నాయి. అది చాలా సహజం కూడా. కానీ ఎన్డీయే కూటమిలో, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు ఏదో మొక్కుబడిగా మోడీని మెచ్చుకొంటూ మాట్లాడుతున్నాయి తప్ప ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆయనకి అండగా నిలబడాలని ప్రయత్నించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతకంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో భాజపా నేతలు కూడా ప్రతిపక్షాల విమర్శలని గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు.

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై చాలా హడావుడి చేస్తోంది. కానీ రెండు రాష్ట్రాలలో భాజపా నేతలు వారిని గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేయలేదు. భాజపాకి మిత్రపక్షంగా ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కరే మోడీ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన కూడా రూ.500, 2,000 నోట్లని ప్రవేశపెట్టడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ మోడీ తీసుకొన్న నిర్ణయాన్ని భాజపా నేతలకంటే ఆయన గట్టిగానే సమర్ధిస్తున్నారు. దాని వలన దేశానికి, సామాన్య ప్రజలకి కలిగే ప్రయోజనాలని కూడా వివరిస్తున్నారు. కానీ భాజపా నేతలలో తీవ్ర ఉదాసీనత కనిపిస్తోంది. ఎందుకో తెలియదు.

దాని వలన భాజపా నేతల వద్దే చాలా నల్లధనం ఉందని కాంగ్రెస్, వైకాపాలు చేస్తున్న ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి కల్పిస్తున్నారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడంలో ఎప్పుడు ముందుండే సోము వీర్రాజు, పురందేశ్వరి వంటివారు ఇప్పుడు కనబడటం లేదు. పరిస్థితులు మామూలుగా ఉన్నప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అటువంటి భాజపా నేతలు ఇటువంటి క్లిష్ట సమయంలో తమ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలబడకపోవడంతో వారు కూడా ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారా? అనే అనుమానం కూడా కలుగుతోంది.


Related Post