మోడీకి ఊరట నిచ్చిన శత్రువు

November 16, 2016


img

నోట్ల రద్దు కారణంగా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున వారి నుంది తనకి ప్రాణహాని కూడా ఉందని స్వయంగా మోడీయే చెప్పారు. ఒక ప్రముఖ ఆర్ధిక రంగ నిపుణుడు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం గురించి ఏమన్నారంటే, “మోడీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారు. ఎంత అంటే తను కూర్చొన్న కొమ్మనే నరుక్కొనేంత! ఎందుకంటే రాజకీయాలలో మంచి భవిష్యత్ ని కోరుకొంటున్నవారు ఎవరూ తమకి నష్టం కలిగించే ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఆయన నిర్ణయం పట్ల బయటవారే కాకుండా స్వంత పార్టీలో వారు కూడా వ్యతిరేకిస్తూనే ఉండి ఉండవచ్చు. కానీ ఆయన దేశహితం కోసం ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారంటే ఆయనకి తన రాజకీయ భవిష్యత్ పై పెద్దగా ఆశలేవీ లేవని అర్ధం అవుతోంది. ఆయన తీసుకొన్న ఈ నిర్ణయంతో దేశ ఆర్ధిక వ్యవస్థ చాలా బలపడుతుంది. దేశంలో చాలా వ్యవస్తలలో మంచి మార్పులు కనబడతాయి,” అని అన్నారు. 

ఆర్ధిక రంగ నిపుణుల అభిప్రాయం ఎలాగున్నప్పటికీ, దేశంలో ప్రతిపక్ష పార్టీలు మాత్రం దీనివలన దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని వాదిస్తున్నారు. ఎవరి వాదనలు నిజమో కాలమే చెపుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ నల్లకుభేరుల నుంచి, దేశంలో ప్రతిపక్షాల నుంచి చాలా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. 

సరిగ్గా ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని బద్దశత్రువుగా భావించే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తను మోడీ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని, దాని వలన దేశానికి చాలా మంచి జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. మోడీ చెప్పినట్లు, దీని తరువాత దేశంలో బినామీ ఆస్తులని వెలికి తీసే కార్యక్రమం మొదలుపెట్టాలని కోరారు.

ఉత్తరాది రాష్ట్రాలలో మంచి పేరు, పలుకుబడి, గుర్తింపు, గౌరవం కలిగి ఉన్న నేత నితీష్ కుమార్. ఆయన వంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగంగా మద్దతు తెలుపడంతో మోడీ ప్రభుత్వానికి కొండంత బలం చేకూరినట్లు అయింది.  

 


Related Post