వాళ్ళు ప్రజల పక్షాన్నే పోరాడుతున్నారా?

November 16, 2016


img

నోట్ల రద్దు కారణంగా దేశంలో సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు తప్ప ధనికులు, నల్లధనం దాచుకొన్నవారు కాదని ప్రతిపక్షాల వాదన.  ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలలో చాలా మంది దేశం కోసం ఆ మాత్రం ఇబ్బందులు భరించగలమని చెపుతుంటే, వారు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు కనుక నోట్ల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

నోట్ల రద్దు నిర్ణయం వలన సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే కానీ ఆ నిర్ణయాన్ని ఉపసహకరించుకొన్నా వారికి కొత్తగా ఒరిగే లాభం ఏమీ ఉండబోదు. ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అంతే! అయితే ఈ ఇబ్బందులు కలకాలం ఉండవని అందరికీ తెలుసు. ఇప్పటికే దేశంలో బ్యాంకులు, ఎటిఎంల మీద క్రమంగా ఒత్తిడి తగ్గుతోంది. మరొక వారం పది రోజులలో అది ఇంకా తగ్గడం ఖాయం అని అందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని ప్రతిపక్షాలు ఎందుకు పోరాడుతున్నాయి అంటే, అవి సామాన్య ప్రజల గురించి కాక నల్లధనం దాచుకొన్నవారి తరపునే పోరాడుతున్నాయి కనుక. ఒకవేళ వాళ్ళు కోరుతున్నట్లుగా కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకొంటే దాని వలన సామాన్యులకి మేలు కలుగుతుందా లేక నల్లధనం దాచుకొన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకి మేలు కలుగుతుందా? అని ప్రశ్నించుకొంటే వచ్చే సమాధానం అందరికీ తెలుసు. 

కేంద్రప్రభుత్వం తీసుకొంటున్న అనేక చర్యల్ వలన త్వరలోనే సామాన్య ప్రజలకి ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతే ఇక అప్పుడు ఎవరూ కూడా కేంద్రప్రభున్ని ప్రశ్నించరు..వ్యతిరేకించరు కూడా. కనుక ఈలోగానే సామాన్యుల ఆగ్రహాన్ని సాకుగా చూపించో లేక వారి ఆగ్రహాన్ని ప్రభుత్వం మీదకి మళ్ళించో ఏదో విధంగా కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయాన్ని ఉపసంహరింపజేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్లు చెప్పవచ్చు. కనుక మోడీ ప్రభుత్వం, ప్రతిపక్షాలు రెండూ కూడా సమయంతో పోటీ పడుతూ యుద్ధం చేస్తున్నాయి. ఈ నోట్ల రద్దు వలన దేశంలో కలిగిన సమస్యలని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మోడీ ప్రభుత్వం, ఆలోగానే మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయాన్ని ఉపసంహరింపజేయాలని ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. 

కనుక ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ప్రతిపక్షాలు నల్లకుభేరుల తరపున, ప్రజలని ఇబ్బందులకి గురి చేస్తున్న మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజల వైపు నిలబడి పోరాడుతున్నట్లుగా చెప్పవచ్చు. మోడీ ప్రభుత్వం తన నిర్ణయంపై గట్టిగా నిలబడి ఉండాలనుకొంటోంది కనుక నల్లకుభేరుల తరపున పోరాడుతున్న ప్రతిపక్షాలు ఈ యుద్ధంలో చివరికి ఓడిపోక తప్పదు. అందుకే ఈ యుద్దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ధర్మయుద్ధం అని అభివర్ణించారు.



Related Post