మోడీ నిర్ణయంతో వాళ్ళకీ ఇబ్బందేనట!

November 16, 2016


img

నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రజలే కాదు...నల్లకుభేరులు, ఉగ్రవాదులు, వేర్పాటువాదులు , మావోయిష్టులు ఇంకా చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పొరుగు దేశం అయిన నేపాల్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి బయటపడింది. సాక్షాత్ నేపాల్ ప్రధాని ప్రచండ భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి, నోట్ల రద్దు కారణంగా భారత్ లో పని చేస్తున్న లక్షలాది నేపాలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలని పరిష్కరించవలసిందిగా కోరారు. వారిలో చాలా మంది దినసరి కూలీలుగా పనిచేస్తున్న వారేనని వారు నోట్ల మార్పిడికి చాలా ఇబ్బందులు పడుతున్నారని కనుక వారికి ఆ వెసులుబాటు కల్పించాలని కోరారు. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారు. 

కానీ ఈ సమస్యని మరికొంత లోతుగా పరిశీలించినట్లయితే, ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి. భారత్ లో నకిలీ కరెన్సీ బెడద చాలా దశాబ్దాలుగా ఉన్నదే. దానిలో అధిక శాతం పాకిస్తాన్ నుంచే ఎక్కువ దిగుమతి అవుతోందని తరచూ వార్తలలో చూస్తూనే ఉన్నాము. కొన్నిసార్లు నేపాల్ ద్వారా కూడా నకిలీ కరెన్సీ భారత్ లోకి సరఫరా అవుతోందనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాము. భారత్ లోనే కాకుండా నేపాల్ సరిహద్దు ప్రాంతాలలో కూడా భారత్ కరెన్సీ చేతులు మారుతుంటుంది. ఇప్పుడు నోట్ల రద్దు కారణంగా ఆ మార్గం కూడా మూసుకుపోయింది. కనుక ఆ ప్రభావం నేపాల్ పై కూడా ఎంతో కొంత పడటం సహజమే. 

ఇక భారతీయులే నోట్ల మార్పిడికి చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు దేశంలో పనిచేస్తున్న నేపాల్ కార్మికులు ఇంకా ఇబ్బందులు పడటం కూడా సహజమే. కానీ వారు సాధారణ కార్మికులే అయితే వారి వద్ద పెద్ద మొత్తాలలో పాతనోట్లు ఉండవు. కనుక వారు కూడా తమ దినసరి అవసరాలకి సరిపడే డబ్బు చేతిలో లేకనే ఇబ్బందులు పడుతుండవచ్చు. ఒకవేళ వారి వద్ద కూడా నల్లధనం లేదా నకిలీ కరెన్సీ ఉన్నట్లయితేనే నష్టపోతారు. కనుక అటువంటి వారిని బయటపెట్టడానికే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నప్పుడు వారి కోసం ఆలోచించనవసరం లేదు. ఒకవేళ సామాన్య కార్మికులు, దినసరి వేతనాలు పొందుతున్నవారైతే భారతదేశ ప్రజలతో బాటు కొన్ని రోజులు ఇబ్బందులు భరించక తప్పదు. కానీ వారు పొరుగు దేశస్తులు కనుక భారత ప్రభుత్వం వారి సమస్యలని సానుభూతితో పరిష్కరిస్తే తప్పు కాదు.    



Related Post