నెంబర్: 1 ర్యాంక్ అంత ఈజీగా రాలేదు

November 15, 2016


img

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత ఏడాది 13వ స్థానంలో ఉన్న తెలంగాణా రాష్ట్రం ఈ ఏడాది నెంబర్:1 స్థానం సాధించింది. అదేమి అంత ఈజీగా వచ్చింది కాదు. ప్రపంచ బ్యాంక్ సూచించిన 340 అంశాల ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన నివేదికలని కేంద్ర వాణిజ్య శాఖ పరిశీలించి వాటిలో అత్యధిక స్కోర్ సాధించిన రాష్ట్రాలకి ప్రపంచ బ్యాంక్ ఆమోదంతో ర్యాంకులు ప్రకటిస్తుంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల కోసం పేర్కొన్న 340 అంశాలలో 324 అంశాలకి అనుగుణంగా తెరాస సర్కార్ సంస్కరణలు చేపట్టడంతో నెంబర్: 1 స్థానం సంపాదించుకోగలిగిందని ఐటి శాఖ మంత్రి కేటిఆర్ చెప్పారు. గత ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్స్ ప్రకటించక ముందు తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలే అత్యుత్తమైనవని భావించామని కానీ అది తప్పు అని తెలుసుకొన్నాక, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి ఎక్కడెక్కడ అవరోధాలు ఉన్నాయో గుర్తించి వాటన్నిటినీ తొలగించగలిగామని మంత్రి కేటిఆర్ చెప్పారు. 

“ఒక పెట్టుబడిదారుడిని ఆకర్షించడానికి ఎంతగా కష్టపడాలో అతనికి రాష్ట్రంలో వ్యాపారం లేదా పరిశ్రమ పెట్టుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించడానికి అంతకంటే ఎక్కువే కష్టపడాలి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకొంటున్న వ్యక్తికి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పట్ల అపనమ్మకం ఏర్పడితే, అతనికి మళ్ళీ ఆ నమ్మకం కలిగించడం, పట్టి ఉంచడం రెండూ చాలా కష్టమే. అందుకే ముందుగా మా విధానాలలో లోపాలని గుర్తించి సవరించుకొని, వాటి పట్ల మేము పూర్తిగా తృప్తి చెందిన తరువాతే పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నాము. మా ప్రయత్నాలు ఫలిస్తున్నాయని చెప్పడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్: 1 స్థానం పొందడమే అని చెప్పవచ్చు,” అని కేటిఆర్ అన్నారు. మా తదుపరి లక్ష్యం కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కేటిఆర్ తెలిపారు. ఆ లక్ష్యాన్ని తప్పకుండా సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. 


Related Post